తెలుగులో రియలిస్టిక్ సినిమాల రాక చాలా తక్కువ. వచ్చినా ఏవీ ఆడలేదు కూడా. సెట్టింగులు, మేకప్పులు, డాబులు దర్పాలూ లేకుండా సినిమా తీయడం.. తెలుగులో ఓ సాహసం. ఆ సాహస ప్రక్రియ చేసిన సినిమా ‘కేరాఫ్ కంచర పాలెం’. వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుండంతో ఈ సినిమాపై బజ్ పడింది. ఇప్పుడు టీజర్ వచ్చింది. ఈ సినిమా టోన్, కలర్, నేరేషన్.. ఇవన్నీ ఎలా ఉంటాయో టీజర్ చూస్తే అర్థమైపోతోంది. రాజుగాడు అనే నలభై తొమ్మిదేళ్ల మధ్యవయస్కుడి కథ ఇది. తన బ్రహ్మచర్యం.. దానికి తగిన కారణాలు, తన జీవితంలోని మధురస్మృతులు ఇవన్నీ.. కంచరపాలెం కథకు మూలాలు. కథ ఎలాగున్నా.. టేకింగ్, డైలాగులు అన్నీ రియలిస్టిక్‌గా అనిపిస్తున్నాయి. నటీనటుల్లో తెలిసిన మొహం ఒక్కటీ లేదు. కాకపోతే… వాళ్లంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారని టీజర్లోనే అర్థమైపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై కంచర పాలెం ప్రదర్శితమైంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారుతున్న దృష్ట్యా, కొత్త తరహా కథలకు పట్టం కడుతున్న దృఫ్ట్యా.. కంచర పాలెం సినిమాకీ అలాంటి గౌరవమే దక్కుతుందేమో అనిపిస్తోంది. వచ్చే నెల 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ చేతిలో పడింది కాబట్టి.. ప్రమోషన్లు బాగానే చేసే అవకాశం ఉంది. మరి ఈ చిన్న సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబరు 7 వరకూ ఆగాల్సిందే.