ధనిక రాష్ట్రం తెలంగాణలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బిల్లు బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా పెండింగులో పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రయివేట్ ఆస్పత్రుల సంఘం బకాయిల కోసం అడిగీ అడిగీ విసిగిపోయి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసింది. చివరకు కార్పొరేట్ ఆస్పత్రులు కూడా వీటితో జత కలిశాయి. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి.
పేద ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించడం ఆరోగ్యశ్రీ పథకం ఉద్దేశం. ముఖ్యంగా అవసరమైన ఆపరేషన్లు చేయించుకోవడానికి పేదలకు దీనివల్ల వెసులుబాటు లభించింది. రెండు లక్షల రూపాయల వరకూ వైద్య సేవలు ఉచితంగా పొందడానికి సామాన్యులకు అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లోని ఆస్పత్రుల్లో మొదట పేషేంట్ కు చికిత్స చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. చాలా కాలం పాటు ఇది సాఫీగానే నడిచింది. కానీ ఈమధ్య తరచూ వివాదం తలెత్తుతోంది.
ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఈ సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది రోగలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం ఈ పథకం కింద చికిత్స చేయించుకోవడానికి రోగులు పెద్ద సంఖ్యలో నిమ్స్ కు వెళ్లారు. దీంతో నిమ్స్ ఆవరణ కిటకిటలాడింది. రోజూవారీగా వచ్చే వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది పేషెంట్లు క్యూకట్టడంతో అక్కడి సిబ్బందికి, డాక్టర్లకు తలకు మించిన భారమైంది.
ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాల సంఘాలు చెప్పేదాని ప్రకారం ప్రభుత్వం 350 కోట్ల రూపాయలకు పైగా బాకీ ఉంది. సంపన్న రాష్ట్రానికి ఈ మొత్తం చెల్లించడం కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చిందా అనేది అంతుపట్టని విషయం. పోనీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడానికి గట్టి ప్రయత్నం జరిగిందా అంటే అదీ లేదు. సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందేలా గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఆరోగ్యశ్రీ అవసరం ఉండేదే కాదు. కానీ గత రెండేళ్లుగా ఆ దిశగా చెప్పుకోదగ్గ ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు.
అంతెందుకు, స్వయంగా ఆర్థిక మంత్రి కాలికి దెబ్బతగిలితే కార్పొరేట్ ఆస్పత్రిలో వారం రోజులున్నారు. కాలి గాయానికి కూడా చికిత్స చేయలేని దుర్భర స్థితిలో ప్రభుత్వ ఆస్ప్రత్రులు ఉన్నాయనే అభిప్రాయం కలిగేలా మంత్రులే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ఇక సామాన్యులకు సర్కారీ దవాఖానాలపై నమ్మకం ఎలా ఉంటుంది.
ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేయరు, ప్రయివేట్ ఆస్పత్రలుకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించరు. ఇంకా చర్చల పేరుతో కాలయాపన చేసేకంటే, వెంటనే నిధులు విడుదల చేయవచ్చు కదా అని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ పేద రోగుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు కేసీఆర్ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందో !