టీడీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత భద్రతను.. ఏపీ ప్రభుత్వం కుదించిందనే ఆందోళన… టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దానికి వారు చెబుతున్న ఉదాహరణలో.. రూట్ క్లియరెన్స్ లేకపోవడం… ఎస్కార్ట్ వాహనాలను తీసేయడం. మామూలుగా.. చంద్రబాబు భద్రతలో మార్పులు చేయాలంటే… రివ్యూ మీటింగ్ పెట్టాలని.. ఆ తర్వాతే పోలీసు అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు. అవేమీ లేకుండానే మార్పులు చేశారని.. చెబుతున్నారు.
ఎన్ఎస్జీ భద్రత పొందుతున్న అది కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్.. ఎన్ఎస్జీ.. చంద్రబాబు భద్రతను పర్యవేక్షిస్తుంది. ఈ వ్యవస్థ అతి కొద్ది మందికి మాత్రమే భద్రత కల్పిస్తుంది. ఇప్పటి వరకూ.. ఎన్ఎస్జీ సెక్యూరిటీ జయలలిత, కరుణానిధి, మాయావతి, అఖిలేష్, చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, తరుణ్ గోగొయ్, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, ఎల్కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, గులాం నబీ ఆజాద్‌లకు మాత్రమే ఈ సంస్థ రక్షణ చూస్తుంది. వీరిలో జయలలిత, కరుణానిధి చనిపోయారు కాబట్టి.. ఆ సంఖ్య తగ్గిపోయింది. ఇక ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి కుటుంబాలకు.. ఎస్పీజీ భద్రత ఉంటుంది. అంతే.. దేశంలో అత్యున్నత భద్రత కల్పిస్తున్న టాప్‌టెన్‌లో చంద్రబాబు కూడా ఉన్నారు.
ఎన్ఎస్జీ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ పోలీసుల భద్రత..!
చంద్రబాబుపై గతంలో నక్సల్స్ హత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పట్నుంచి కేంద్రం.. రక్షణ బాధ్యతను ఎన్ఎస్జీకి అప్పగించింది. గతంలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. భద్రతను మాత్రం తగ్గించలేదు. ఆయన ఇప్పటికీ.. హిట్ లిస్ట్‌లో ఉన్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు అంచనా వేసినంత కాలం.. సెక్యూరిటీని కొనసాగిస్తారు. ఆ ప్రకారం.. ఇప్పటి వరకూ సెక్యూరిటీలో మార్పులు చేయలేదు. ఆయన సెక్యూరిటీలో ఎలాంటి చిన్న మార్పు చేయాలన్నా.. అది నిబంధనల ప్రకారం జరగాల్సి ఉంటుంది. ఎన్ఎస్జీ భద్రత మార్పు ఉండకపోవచ్చు కానీ.. ఆ ప్రమాణాలకు అనుగుణంగా.. ఆయన ఎక్కడకు వెళితే… అక్కడ రక్షణ చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక పోలీసులపై ఉంటుంది. పైగా ఆయన ఏపీలో ప్రతిపక్ష నేత కాబట్టి.. ఆ బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది.
మార్పులు చేయాలంటే కచ్చితంగా రివ్యూ మీటింగ్ జరగాలి..!
సాధారణంగా ముఖ్యమంత్రులకు రాష్ట్ర పోలీసులే భద్రత కల్పిస్తారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ భద్రత కల్పించరు. ్ందుకే… ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే.. ఆయనకు అత్యంత భద్రత ఉంటుంది. ఒక వేళ లేకపోయినా.. ఆయనకు ముఖ్యమంత్రి కన్నా.. ఎక్కువ భద్రత లభిస్తుంది. ప్రస్తుతం ఏపీలో జగన్ కన్నా ఎక్కువ భద్రతా ఏర్పాట్లు చంద్రబాబుకు ఉంటాయి. ఏపీ పరిధిలో సెక్యూరిటీలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. దానికి తగ్గట్లుగా రివ్యూ మీటింగ్ పెట్టాలి. అలాంటివేమీ లేకుండానే… ఎస్కార్ట్ వాహనం, రూట్ క్లియరెన్స్ ను తీసేశారు. అదే ఇప్పుడు.. టీడీపీ నేతల ఆందోళనకు కారణం అవుతోంది.