పోలీసులు తప్పుడు కేసు పెట్టి డిస్మిస్ చేసిన కానిస్టేబుల్ భాను ప్రకాష్ ఫిర్యాదు చేయడంతో అనంతపురం ఎస్పీతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై కేసు నమోదు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానానికి వెళ్తానని భానుప్రకాష్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు కేసులు నమోదు చేయాలని నిర్ణయించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారికి క్లీన్ చిట్ ఇప్పించడానికి ఇలా వ్యూహాత్మకంగా కేసులు నమోదు చేయించారన్న వాదన వినిపిస్తోంది. వేగంగా విచారణ జరిపి.. ఆ ఆరోపణలన్నీ తప్పని.. భానుప్రకాష్ తప్పుడు ఆరోపణలు చేశారనే నివేదికను విడుదల చేస్తారని.. అలా చేసినందుకు భానుప్రకాష్‌పై కేసులు పెట్టొచ్చని కూడా భావిస్తున్నారు.
భానుప్రకాష్ రెండు రోజుల కిందట తన ఫిర్యాదులో అనంతంపురం ఎస్పీ ఫక్కీరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. బళ్లారిలో ఆయన మూడుకోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారని.. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ సంచలనం సృష్టించాయి. ఆయన కడుతున్న ఇళ్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఎస్పీ మాత్రం తన పాత ఇంటిని చూపించి అదే తన ఇల్లు అని బుకాయించే ప్రయత్నం చేశారు. ఓ పత్రికకు పరువు నష్టం నోటీసులు స్వయంగా వెళ్లి ఇచ్చారు. ఇదంతా వివాదాస్పదమవుతోంది.
అదే సమయంలో ప్రకాష్ న్యాయస్థానానికి వెళ్తే ఇబ్బందని అనుకున్నారేమో కానీ.. ఎస్పీ ఫక్కీరప్పనే డిఐజిని కలిసి తనపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎస్పీ ఫక్కీరప్పతో పాటు,అడిషనల్ ఎస్పీ హనుమంతు,సిసిఎస్ డీఎస్ప మహబూబ్ బాషా,ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పై అనంతపురం టూటౌన్ లో కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేసిన కేసులో ఏ కారణం చెప్పారో ఆ మహిళ .. పోలీసులపైనే తీవ్ర ఆరోపణలు చేసింది. అది ఫేక్ కేసు అని బట్టబయలు అయింది. దీంతో ఎస్పీ తప్పుడు కేసులతో సొంత డిపార్టు మెంట్ ఉద్యోగినే డిస్మిస్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడీ వివాదం ఎటు తిరుగుతుందో కానీ.. పోలీసు వ్యవస్థకు మాత్రం మచ్చలా మిగిలిపోతోంది.