మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు గుడివాడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తాము ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం కొడాలి నాని అంటూ ఫిర్యాదులో వాలంటీర్లు పేర్కొన్నారు. నానితో పాటు అయన సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి అభ్యర్థించారు. ఎవరి ఒత్తిడి మేరకు ఉద్యోగాలకు రాజీనామా చేశారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి.. అప్పుడు చూద్దాం అంటూ అచ్చెన్నా చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వాలంటీర్లు పోలిసు స్టేషన్ ల వద్దకు పరుగులు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే గుడివాడలో కొడాలి నాని కారణంగానే తాము ఉద్యోగాలకు రాజీనామా చేశామంటూ వాలంటీర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చూస్తుందన్న ఫిర్యాదుతో ఈసీ వారిని ఎన్నికలకు దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వారితో వైసీపీ నేతలు ఉద్యోగాలకు రాజీనామా చేయించి…ఎన్నికల ప్రచారంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే మళ్లీ ఉద్యోగాలకు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు రోడ్డున పడ్డారు.
దీంతో గుడివాడలో తమను ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వేధించారంటూ కొడాలి నానిపై వాలంటీర్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.