జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ఎలాగైనా ఆపాలని వైసీపీ అధినేత అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వాంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించి..శాంతి భద్రతల సమస్య ఏర్పడేలా చేశాయని ఓ వార్డు వాలంటీర్ తో ఫిర్యాదు చేయించి కేసు పెట్టేశారు. పవన్ కల్యాణ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. సెక్షన్ 153, 153ఏ, 505(2) కింద కేసులు పెట్టారు. ఇందులో సెక్షన్ 153 రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెబుతుంది.
రెండోది 153 ఏ ప్రకారం రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలు చెలరేగే ఆస్కారం ఉన్నప్పుడు పెట్టే సెక్షన్. 505(2) ప్రకారం రూమర్స్‌ను ప్రచారం చేస్తే పెట్టే కేసు. ఇలా రూమర్స్ వల్ల గొడవలు జరుగుతాయని చెప్పినప్పుడు ఈ సెక్షన్లో కేసు రిజిస్టర్ చేస్తారు. ఇలా మూడు సెక్షన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నమోదు గురించి బయటకు తెలిసిన కాసేపటికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి..సీఎం జగన్ ను కలిశారు. ఏ టాపిక్ పై కలిశారో స్పష్టత లేదు. కానీ పవన్ కల్యాణ్ పై నమోదు చేసిన కేసుల విషయంలో తదుపరి చర్యలు తీసుకునే అంశంపై చర్చ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మూడు కేసులు సీరియస్ కేసులే. ఇలాంటి కేసుల్లో ఏపీ పోలీసులు అర్థరాత్రి.. అపరాత్రి అని చూడకుండా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసితీసుకెళ్లిపోతారు. అయితే.. పవన్ కల్యాణ్ వాలంటీర్స్ పై చేసిన వ్యాఖ్యలు ఆ సెక్షన్ల కింద ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. వైసీపీ నేతలు ఎవర్ని ఆరెస్ట్ చేయాలనుకున్నా.. ఎవరో ఒకరితో ఫిర్యాదు ఇప్పించి ఈ సెక్షన్ల కింద కేసులు పెడుతూంటారు. పవన్ విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే పవన్ ను అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారా అన్నది కీలకంగా మారింది. జగన్ రెడ్డి మానసిక స్థితి గురించి తెలిసిన వారు అరెస్ట్ చేయించకపోతేనే ఆశ్చర్యపోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.