తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కి లేనిపోని తలనొప్పి ఎదురైంది. అభిమానుల హడావుడి రజనీని మరోసారి చిక్కుల్లో పడేసింది. రజనీ కాంత్ వల్లే కర్ణాటక రాష్ట్రంలో పాలు దొర్కడం లేదట. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఈ విషయంలో రజనీకాంత్‌పై కోర్టులో ఓ కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. రజనీ లేటెస్టు చిత్రం కబాలి విడుదలకు సిద్ధమైంది. రజనీకాంత్ పోస్టర్లు, నిలువెత్తు కటౌట్లు ఇటు తమిళనాడులోనూ, అటు కర్నాటకలోనూ ఏర్పాటు చేశారు. రజనీ పోస్టర్ కనిపిస్తే.. తమిళ తంబీలకు పూనకాలు వచ్చేస్తాయి కదా. ఆ హంగామా బెంగళూరుకీ పాకింది. రజనీ పోస్టర్లకూ, కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు అభిమానులు. లీటర్ల కొద్దీ పాలు.. రజనీ వల్ల నేలపాలు అవుతున్నాయి. దాంతో.. బెంగళూరులో రజనీకాంత్ కి వ్యతిరేకంగా ఓ కంప్లైంట్ నమోదయ్యింది.
రాష్ట్రంలో పాల సమస్య అధికంగా ఉందని, రజనీకాంత్ వల్ల అది మరింత పెరిగిందని, ఈ విషయంపై రజనీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ మణివన్న అనే ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశాడు. ఈ విషయాన్ని కూడా కోర్టు సీరియస్‌గా తీసుకొంది. ఈ విషయంపై రజనీ స్పందించాలని సమన్లు జారీ చేసింది న్యాయస్థానం. మరి రజనీ ఏమంటాడో. తన అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి. అదేంటో… అభిమానులు ఏం చేసినా హీరోలకే చుట్టుకొంటుందిప్పుడు. ఈ విషయాల్లో హీరోలు కాస్త జాగ్రత్తగానే ఉండాలి మరి.