పాపం.. అసలే హన్సికకు సినిమాల్లేవు. దానికి తోడు కొత్త వివాదాలొకటి. తన 50వ సినమా `మహా`.. తో ఇప్పుడు `మహా` చిక్కొచ్చిపడింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్.. కాస్త విభిన్నంగా ఉండాలన్న కోరికతో.. కొత్తగా డిజైన్ చేశాడు దర్శకుడు జమీల్. అదే ఇప్పుడు హన్సికని చిక్కుల్లో పడేసింది. స్వామీజీ వేషధారణలో ఉన్న హన్సిక చుట్ట తాగుతూ ఉన్న ఫొటోని ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. దీనిపై తమిళనాట పెద్ద దుమారమే రేగుతోంది. తమ మనోభావాల్ని ఈ పోస్టర్ దెబ్బతీసేలా ఉందని కొంతమంది కోర్టులో ఫిర్యాదు చేశారు. పీఎంకే సభ్యుడు జానకి రామన్ హన్సికపై, దర్శకుడిపై ఇప్పుడు కేసు వేశారు. పోస్టర్ ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు.
దాంతో దర్శకుడు దిగి వచ్చాడు.. ‘దర్శకుడిగా పోస్టర్ ప్రత్యేకంగా ఉండాలని భావించాను.. అంతేకానీ కావాలని మతపరంగా మరొకర్ని కించపర్చాలనేది నా ఉద్దేశం కాదు. నేను మానవత్వాన్ని నమ్ముతా.. హిందూ-ముస్లింను కాదు. దయచేసి ఈ విషయంలో మతం, కులం అనే వాటిని తీసుకురావొద్దు’ అని పేర్కొన్నారు. హన్సిక కూడా ఈ వివాదంతో విసిగిపోయినట్టు కనిపిస్తోంది. ట్విట్టర్లో తనని ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా.. నిబ్బరంగానే ఉంటోంది. ఈ పోస్టర్ గురించి గానీ, ఈ వివాదం గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఎలాంటి కేసులొచ్చినా… న్యాయపరంగానే ఎదుర్కోవాలని చూస్తోంది హన్సిక. అందుకోసం న్యాయవాదుల్ని కూడా సంప్రదిస్తోందట.