గత నెల 23న కరీంనగర్ లో ఓ సభలో ఎం.ఐ.ఎం. నేత అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొని, కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. కొంత ఎమోషనల్ గానే ఆయన మాట్లాడారు! తాను పోతే, వందల మంది అక్బురుద్దీన్లను అల్లా తయారు చేసుకుంటాడనీ, తాను ఆయన సేవకుడననీ, తాను లేకపోయినా ఏదీ ఆగకూడదని అన్నారు. కరీంనగర్ లో ఒకప్పుడు మన నాయకులు ఉండేవారనీ, ఇప్పుడు భాజపా ఎంపీ ఉన్నాడన్నారు. ఎం.ఐ.ఎం.ని ప్రజలు ఓడించాలనుకుంటే తప్పులేదనీ… భాజపా గెలుపును తాను అంగీకరించనన్నారు. ఇలా ఉద్వేగంతో ఆయన చేసిన ప్రసంగంపై ఆరోజే భాజపా నేతలు స్పందించారు. అక్బరుద్దీన్ మాటల్ని తాము పరిశీలించాలమనీ, వివాదస్పదంగా ఉన్నాయనీ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటనలు చేశారు. అనుకున్నట్టుగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తే… ఆయన వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేవిలా లేవని పోలీస్ కమీషనర్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. కానీ, భాజపా నేతలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు!
కరీంనగర్ పట్టణ భాజపా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఇదే అంశమై కోర్టుకు వెళ్లారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ మాట్లాడారనీ, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన న్యాయ స్థానం… ఓ నాలుగు సెక్షన్లను ప్రస్థావిస్తూ, అక్బరుద్దీన్ మీద కేసు బుక్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు! పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చేసినా కూడా భాజపా నేతలు కోర్టు ఆశ్రయించడం, ఆయనపై కేసు నమోదు కావడం విశేషం!
అయితే, అక్బరుద్దీన్ తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కాస్త ఉద్వేగంతో మాట్లాడారనే అభిప్రాయమే అప్పుడు వ్యక్తమైంది. తన ఒక్క గొంతు ఆగిపోయినంత మాత్రాన ఏమీ కాదనీ, వేల గొంతుల పుట్టుకొస్తాయనీ, మనలో ఐకమత్యం లేనప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం సరికాదనీ అన్నారు. మొత్తానికి, ఈ అంశాన్ని మరింత పెద్దది చేస్తోంది భాజపా. పదిరోజుల కిందటే భాజపా నేతలు ప్రకటించినట్టుగా… అంశంపై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుంటుందని చెప్పారు. అంతవరకూ వదిలేట్టుగా లేరు. ఎం.ఐ.ఎం., భాజపాల మధ్య ఎప్పుడూ ఒక రకమైన వివాదాస్పద వాతావరణమే ఉంటుంది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు భాజపా ఈ వివాదాన్ని కొనసాగిస్తోందని అనిపిస్తోంది.