తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై నమోదవుతున్న కేసుల పరంపరలో తాజాగా వల్లభనేని వంశీ పేరు కూడా చేరింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారన్న కేసును ఆయనపై నమోదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆయా చోట్ల స్థలాలే లేవని.. అయినప్పటికీ.. పేదలకు ఇళ్ల పట్టాలను సిద్ధం చేశారని.. తహశీల్దార్ చెబుతున్నారు.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచి తన నియోజకవర్గంలో పలువురు పేదలకు.. వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నారు. స్వయంగా… ప్రభుత్వంతో చెప్పి పనులు చేయించుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ.. ఇళ్ల పట్టాలిచ్చినట్లుగా ఆరోపిస్తూ.. కేసు నమోదు చేయించడం టీడీపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నాళ్లుగా వల్లభనేని వంశీపై అధికార పార్టీ గురి పెట్టిందని.. చివరికి… ఇలా.. తహశీల్దార్ రూపంలోనే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెదకపోయిన తీగ కాలికి తగిలిందని తెలుస్తోంది.
వల్లభనేని వంశీపై… ఎన్నికలకు ముందు నుంచీ తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయి. హైదరాబాద్లో స్థలాలపై అక్కడి పెద్దల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఓ దశలో ఆయన పోటీ నుంచి విరమించుకుందామనుకున్నారు. గెలిచిన తర్వాత ప్రతీ వారం.. ఆయన పార్టీ మారబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సుజనా చౌదరితో సన్నిహిత సంబంధాలుండటంతో.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని.. కొడాలి నానితో టచ్లో ఉండి.. వైసీపీలోకి వెళ్తున్నారని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. మొదట్లో.. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన వంశీ.. ఆ తర్వాత స్పందించడం మానేశారు.