తమిళ నటి మీరా మిథున్ దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాల వారి కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని, షెడ్యూల్ కులాల వారు కోలీవుడ్ నుండి బయటకు వెళ్లిపోవాలని ఆవిడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఎవరు ఈ మీరా మిథున్:
తమిళనాడుకు చెందిన మీరా మిథున్ మోడల్ గా, తమిళ ప్రేక్షకులకు పరిచయం. అయితే ఈవిడ కెరీర్ ఆద్యంతం వివాదాస్పదం. తమిళనాడు లో ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరా, పెళ్లి చేసుకున్న అతి కొద్ది రోజుల వ్యవధిలోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2015 సంవత్సరంలో స్టార్ విజయ్ ఛానల్ లో జోడి నంబర్ వన్ అన్న కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఈవిడ వ్యవహార శైలి నచ్చక జడ్జిలు ఆమె ను షో నుండి తరిమేశారు. అయితే ఆ తర్వాత సంవత్సరం మిస్ సౌత్ ఇండియా గా ఈవిడ విజయం సాధించడంతో ఆమె పేరు తమిళనాట మార్మోగింది. దానికి తోడు 2018 సంవత్సరంలో ఒక మ్యాగజైన్ కు తాను ఇచ్చిన టాప్ లెస్ ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే మోడల్ గా ఉన్నప్పటి నుండే ఆవిడ సినిమాల్లోనూ చేసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ఎంతవాడుగాని సినిమాలో ఆవిడ ఒక పాత్ర చేసింది. అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ పేరు వచ్చే గొప్ప పాత్రలు ఇప్పటి వరకు ఆవిడ చేయలేదు. అయితే 2019 లో బిగ్ బాస్ తమిళ్ లో ఆవిడ పాల్గొని మరింత పాపులర్ అయ్యారు.
మోడీ భక్తురాలు, తమిళ పరిశ్రమలో అనేక వివాదాలు:
బిజెపి పార్టీ ని, మోడీ ని ఎంతగానో అభిమానించే మీరా గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాల్సిందిగా ఆవిడ మోడీని కోరారు. అదే విధంగా తమిళ నటులు విజయ్ , రజినీకాంత్ లపై కూడా అనేక సార్లు నోరు పారేసుకున్నారు. నటీమణులు త్రిష , జ్యోతిక వంటి వారి పైనే కాకుండా హీరో విజయ్ భార్య పై కూడా ఆవిడ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
దళితులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు:
ఇప్పుడు తాజాగా దళితులను ఉద్దేశించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆవిడ తాజా గా ఒక వీడియో ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఒక డైరెక్టర్ ని ఉద్దేశించి ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ డైరెక్టర్ తన ఫోటో ఒక దానిని తన అనుమతి లేకుండా దొంగిలించి పబ్లిసిటీ కోసం వాడుకున్నాడని ఆవిడ ఆరోపించారు. అయితే ఆ క్రమంలో దళితులు అందరినీ ఒకే గాటన కట్టేసి ఆవిడ కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని, షెడ్యూల్ కులాల వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయని, తమిళ సినీ పరిశ్రమలో ఎవరైనా షెడ్యూల్ కులాల వారు ఉంటే వాళ్లు బయటకు వెళ్లిపోవాలని వారి వల్లే క్వాలిటీ సినిమాలు రావడం లేదని ఆవిడ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆవిడ వ్యాఖ్యలు తమిళనాట దుమారం సృష్టించాయి. తమిళనాడు కు చెందిన దళిత పక్షపాత పార్టీ వి ఎస్ కె ఈవిడ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులను కించపరిచేలా ఈవిడ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరింది. వీడియో ఆధారాలు కూడా స్పష్టంగా ఉండడంతో పలు సెక్షన్ల కింద ఆవిడ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏది ఏమైనా సెలబ్రిటీలు గా ఉన్నప్పుడు తాము మాట్లాడే ప్రతి మాటకు ఎంతో ఎక్కువ రీచ్ ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకొని బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం సెలబ్రిటీలకు ఉంది. అయితే దానిని దుర్వినియోగం చేస్తూ సమాజంలోని కొన్ని వర్గాల పై అవాకులు చవాకులు మాట్లాడే ఇటువంటి సెలబ్రిటీలకు ఏ విధమైన శిక్ష పడుతుంది అన్నది వేచిచూడాలి.