యువ టాలీవుడ్ నిర్మాత పరుచూరి కిరీటి ఇబ్బందుల్లో పడ్డాడు. కారు అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుతున్నాడన్న పెట్రోలింగ్ పోలీసుల ఫిర్యాదుతో కిరీటిపై సెక్షన్ 366 కింద కేసు నమోదైంది. గత మూడు రోజులుగా ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ వీధుల్లో అత్యంత వేగంగా, ప్రమాదకరంగా కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దాంతో పాటు.. కిరీటి ఓ ఉన్నతాధికారి అమ్మాయిని వేధిస్తున్నాడని, ఆమె వెంట పడుతున్నాడని, పరుచూరి కిరీటి పై పోలీసులు కన్ను వేయడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. ప్రతీరోజూ డాన్సు క్లాసులకు హాజరై, ఇంటికి వెళ్లే దారిలో ఆ అమ్మాయిని అటకాయించి, అల్లరి చేస్తున్నాడన్నది కిరీటిపై అభియోగం. కానీ కిరీటి మాత్రం `కారులో పోకోమెన్ గేమ్ ఆడుతున్నా. అందుకే అంత వేగంగా వెళ్లాల్సివచ్చింది` అంటూ పోలీసులకు చెప్పాడట. కారు డ్రైవ్ చేస్తూ గేమ్ ఆడడం మరో నేరం. దాంతో కిరీటి కి కష్టాలు తప్పేట్టు లేవు. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడే.. కిరీటీ. ప్రస్తుతం సునీల్ తో ఉంగరాల రాంబాబు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.