ఇప్పుడున్న యాంకర్లుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ. సుమ లాంటివాళ్ళు తప్పితే రెగ్యులర్ కనిపించే యాంకర్లు ఓవర్ యాక్షన్ చేయకుండ స్టేజ్ దిగరు. జనరల్ గా యాంకర్లు అంటే వాక్ చాతుర్యం వుండాలి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వాక్ చాతుర్యం కంటే ‘ఎక్స్ ట్రా’ కరికులమ్ యాక్టివిటిస్ తోనే రెచ్చిపోతున్నారు. భాషపై పట్టుండదు. సమయస్పూర్తి కనిపించదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. నోటి నుండి ఎలాంటి కామెంట్ వచ్చేస్తుందో అని వచ్చిన గెస్టులు భయపడిపోయే పరిస్థితి. ఒకొక్కసారి వీరి ‘అతి’ వివాదాలకు కూడా దారి తీస్తుంది.
తాజాగా యాంకర్ రవి, శ్రీముఖిలు ఓ వివాదంలో చిక్కుకున్నారు. పటాస్ అనే కామెడి షో చేస్తున్నారు వీరిద్దరు. కామెడి అంటే కొట్టు కోవడం, తిట్టు కోవడం, తిట్టించుకోవడం, ఒకరి పరువు ఒకరు తీసుకోవడం.. ఇలా ఉటుంది పటాస్ కామెడి. ఆ ఓవర్ యాక్షన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇప్పుడా కామెడి హద్దులు దాటింది. తాజాగా ఓ ఎపిసోడ్ లో నర్స్ వృత్తిపై ఈ ఇద్దరు యాంకర్లు వేసిన కుళ్ళి జోకులు నర్సుల మనోభావాలను దెబ్బతీశాయి. నర్స్ వ్రుత్తి ని కించపరిచేలా వున్న ఈ కామెంట్స్ పై హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సుష్మిత మాట్లాడుతూ.. ఎంతో గౌరవ ప్రధమైన నర్స్ వృత్తి పై యాంకర్ రవి,శ్రీముఖిలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వీరిద్దరు బయటకనిపిస్తే చెప్పుదెబ్బలు తింటారని హెచ్చరించారామె. ఆ ప్రోగ్రాం నిర్వాహకులంతా తమకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్. మరి ఈ గొడవకు ఎలాంటి ముగింపు పడుతుందో చూడాలి.