బొత్స సత్యనారాయణ అంటే.. విజయనగరంలో ఓ రేంజ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో.. ఆ ఇమేజ్‌కు మరింత మెరుగులు దిద్దుకుటున్నారు. ఆయనను మూలపురుషుడిగా కూర్చోబెట్టి.. మిగతా పనులన్నింటినీ కుటుంబసభ్యులు చక్కబెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు.. ఆ దందాలు మరింత పెరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బొత్స సోదరుడు… తన ఇంటి చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నింటినీ కబ్జా చేసేశారు. ఈ విషయాన్ని ఆ కుటుంబాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. బొత్స సోదరుడు బొత్స ఆదిబాబు విజయనగరంలోని సత్యసాయినగర్‌లో ఉంటారు. ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలన్నింటికీ.. కొద్దిరోజులుగా ఫెన్సింగ్ వేశారు. ఆ స్థలం తనదేనని.. బెదిరించడం ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులంతా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందనను ఎవరైనా ఊహిస్తారు. అదే తెలుగుదేశం పార్టీకిచెందిన నేతలపై అలాంటి ఫిర్యాదు వస్తే.. తక్షణం ఆ నేతను అరెస్ట్ చేసి.. భూములు పంపిణీ చేసేవాళ్లు. కానీ.. విజయనగరం ఫిర్యాదు విషయంలో అధికారులు.. కనీసం… డాక్యుమెంట్లు పరిశీలన జరిపి.. వారి స్థలాలు వారికి ఇస్తామన్న హామీని కూడా ఇవ్వలేకపోయారు. బొత్స సత్యనారాయణ కోరుకున్న అధికారే.. ఆయన గుడ్ లుక్స్‌లో ఉన్న అధికారులు మాత్రమే విజయనగరంలో ఉంటారు. అందుకే… బొత్స ఆదిబాబు కబ్జాలపై.. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటున్నారు.
బొత్స కుటుంబసభ్యుల వ్యవహారాలపై… గతంలోనే.. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడే.. రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆయన దందాలే.. 2014 ఎన్నికల్లో ఓటమికి కారణమని చెప్పుకున్నారు. ఇప్పుడు అధికారం అందిన తర్వాత మరోసారి అలాంటి దందాలే కుటుంబసభ్యులు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.