అనంతపురం లో మంత్రి ఉషాశ్రీ చరణ్ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో ఓ చిన్నారి చనిపోయిందని .. ఇదేం పద్దతని ప్రశ్నించిన లోకేష్, చంద్రబాబులపై అనంతపురంలో కేసులు నమోదు చేశారు. ట్విట్టర్ ద్వారా అసత్య ప్రచారం, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, ప్రజల్లో శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా దుష్ప్రచారం చేసిన కారణంగా ఇరువురిపై కేసు నమోదు చేయాలని ఓ వ్యక్తి ఫిర్యాదు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో పోస్టు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో మరణించి దళిత బాలికకు సంబంధించి బహిరంగంగా దుష్ప్రచారం చేసే ప్రకటనలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారన్నారు. ఈ ఫిర్యాదుతో కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన విషయం తెలిసిన తర్వాత “ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డి అని లోకేష్ ట్వీట్ చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావు. నెక్స్ట్ ఏంటి? రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ.” అని సవాల్ చేశారు. సోషల్ మీడియాపోస్టులపై కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది.
అయితే ఏదో ఓ కారణంచూపి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతూనే ఉన్నారు. అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబు, లోకేష్‌లపై కేసులు పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పోలీసుల పనితీరు పై విమర్శలు వస్తున్న తరుణంలో ఇలాంటి కేసులు నమోదు చేయడంతో పోలీసుల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీడీపీ నేతలకు మరో అవకాశం లభించినట్లయింది.