రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రాజకీయంగా ఎటు వెళుతున్నాయో అర్ధం కాని పరిస్థితి కనపడుతోంది. ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిన విలువలు, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా తిలోదకాలు… ఇలాంటి పదాలెన్నో వాడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రాల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా నిరసనలను, ప్రజాస్వామ్య బద్ధంగా సాగే యాత్రలను సైతం అడ్డుకుంటున్న తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలూ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన పాదయాత్ర సైతం అధికార పార్టీకి కంటగింపుగా మారినట్టు కనిపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలనే అవాంఛనీయ తాపత్రయం కనపడుతోంది. ఇప్పటికే ఈ పాదయాత్రకు అనుమతుల్లేవంటూ హోంమంత్రి చినరాజప్ప తదితర నాయకులు అంటున్నారు. ఎవరైనా సరే ఎటువంటి యాత్రలకైనా అనుమతి తప్పనిసరి అంటూ జరగబోయే పరిణామాలను సూచిస్తున్నారు.
మరోవైపు తాజాగా శుక్రవారం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ నేతలు వైఎస్ జగన్ పాదయాత్రపై పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరం. ఈ యాత్ర కారణంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందంటూ ఈ నేతలు మంగళగిరి అడిషనల్ డిజిపి కార్యాలయంలో హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. అలాగే తిరుపతిలో ఫ్లెక్సీలు కట్టడానికి అనుమతి లేదంటూ మునిసిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం… ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వం అనవసరంగా వైఎస్ జగన్ పాదయాత్ర విషయంలో తత్తరపాటుకు గురవుతోందనే అంశాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
నిజానికి ఎవరు పాదయాత్ర చేసినా రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయనేది తెలిసిందే. అయితే నేతలు ఇలాంటి యాత్రలు చేయడం వల్ల ప్రజల సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. నిజంగా తప్పులు దిద్దుకోవాలని, మరింత మెరుగైన పాలన అందివ్వాలని ఆకాంక్షించే ప్రభుత్వం అయితే ఈ తరహా యాత్రల్ని ఆహ్వానించాలి. ఆ యాత్రల్లో వెలుగులోకి వచ్చిన ప్రజాసమస్యల్ని వేగంగా పరిష్కరిస్తే… అది అ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా అనవసరమైన భయాలతో యాత్రను అడ్డుకోవడం ద్వారా దానిని మరింతగా ప్రజలు కోరుకునేలా చేయడం తప్ప మరే ప్రయోజనమూ దక్కదు.