కొండా సురేఖపై వంద కోట్లకు కేసు వేస్తానంటూ మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్న నాగార్జునకు ఎదురు కేసు వచ్చిపడింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని జనం కోసం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలు కూడా తన ఫిర్యాదుకు జత చేశారు. తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారు. వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.
ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కానీ.. నాగార్జున అతి చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనంతో ఉన్నారని ప్రచారం ప్రారంభమైన తర్వాత కేసు నమోదు కావడం సంచలమే. నాగార్జున వ్యాపారాలన్నీ ఒక్కటీ సక్రమంగా ఉండవని పట్టుకోవాలంటే అడుగుకో లొసుగు కనిపిస్తుందని అంటున్నారు. ప్రభుత్వానికి ఇవేం తెలియదని అనుకోలేమని కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.