తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కొన్ని రోజుల కిందట.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. టీటీడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసమయంలో రమణదీక్షితులతో ఉన్న బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని చూసి.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఓ క్రిస్టియన్ మత ప్రచార సంస్థను నడుపుతున్న అనిల్ తో రమణ దీక్షితులకు ఎక్కడ లింక్ కుదిరిందన్న చర్చ విపరీతంగా నడిచింది. టీటీడీ వ్యవహారాలపై పిల్ వేస్తానని తన దగ్గరకు వచ్చాడని..తాను కొన్ని వివరాలు ఇచ్చానని.. అంతకు మించి తనకు అనిల్ గురించి ఏమీ తెలియదని రమణదీక్షితులు చెప్పుకొచ్చారు. కానీ అనిల్ గురించి విషయాలు అప్పటికప్పుడే బయటకు వచ్చాయి. సెటిల్మెంట్లు, బెదిరింపులు, దందాలు, మోసాలు, రౌడీషీట్లు చాలా వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఈ అనిల్.. గుజరాత్ కు చెందిన మరో వ్యక్తి సాయంతో టీటీడీపై హైకోర్టులో పిల్ కూడా వేశారు.
ఇప్పుడీ బోరుగడ్డ అనిల్ మరో ఘరానా మోసం చేసి.. అనంతపురం పోలీసులకు చిక్కాడు. అనంతపురం నగరంలోని జహోవా షామా ప్రార్థనా మందిరం ఉంది. దాని ఆస్తుల కోసం రెండు వర్గాల మధ్య పోరాటం నడుస్తోంది. ఒక వర్గంతో బేరం మాట్లాడుతున్న అనిల్.. రంగంలోకి దిగారు. ఐఏఎస్ అధికారిగా చెప్పుకుని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్‌కు ఫోన్ చేశాడు. ఇదేవిధంగా అనంతపురం త్రీటౌన్ సీఐ మురళీకృష్ణకు… తాను ఐఏఎస్ అధికారిగా, కేంద్రమంత్రి రామస్వామికి ఓఎస్డీగా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నాడు. చర్చి వివాదం పరిష్కరించాలని ఫోన్లో బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో ఆయన ఫోన్‌పై పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఫోన్ చేస్తున్న వ్యక్తి బోరుగడ్డ అనిల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసిన అనంతపురానికి తరలించారు. బోరుగడ్డ అనీల్ పై పలు సెక్షన్ల కింద ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో ఫోటోలు దిగి.. వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించడం, అక్రమ వసూళ్లు వంటి అరాచకాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలా అనిల్ బెదిరింపుల బారిన పడిన వారు ఎవరైనా తమను సంప్రదించవచ్చని.. అనంతపురం పోలీసులు బాధితులకు పిలుపునిస్తున్నారు. అసలు గుజరాత్ లింకేమిటో కనిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన వ్యక్తితో కలిసే.. టీటీడీపై బోరుగడ్డ అనిల్ పిటిషన్ వేశారు.