హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై చిత్తూరుజిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో పనిచేసే ఎయిర్ ఇండియా సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. నిన్న చెక్ ఇన్ టైమ్ అయిపోయిన అరగంట తర్వాత విమానాశ్రయంలోకి ప్రవేశించిన తనను ఎయిర్ ఇండియా సిబ్బంది లోపలికి అనుమతించకపోవటంతో మిధున్ రెడ్డి ఆగ్రహోదగ్రుడై సిబ్బందిపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. పౌరవిమానయాన శాఖ ఆదేశం మేరకు ఎయిర్ ఇండియా అధికారులు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిథున్ రెడ్డి తనను పొట్టలో కుమ్మి, ముఖంపై కొట్టినట్లు ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మిథున్ రెడ్డితోపాటు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మరి 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను ఎవరిమీదా దాడి చేయలేదని మిథున్ రెడ్డి చెబుతున్నారు.