ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ మంంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపైపై సీబీఐ కేసులో దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసి పుచ్చింది. ఆదిమూలపు సురేష్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది. 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ ఆదిమూలపు సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సీబీఐ ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆదిమూలం సురేష్ మాజీ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారని వారి ఇళ్లలో సోదాలు చేసిన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం కనీసం ఇరవై, ముప్ఫై కోట్ల వటికి పైగా ఆస్తులు కల్గి ఉన్నారని చార్జిషీట్ వేశారు. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కొనుగోలు చేశారని సీబీఐ పేర్కొంది.
మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసులో 120 మందికి పైగా సాక్షులను విచారణ చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో తెలిపింది. 500 కు పైగా దస్తవేజులను పరిశీలించినట్లు వెల్లడించింది. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని, .మూడు నెలలో దర్యాప్తు పూర్తి అవుతుందని సుప్రీంకోర్టు కు సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల కిందట రెండు వారాల కిందట తీర్పును రిజర్వ్ చేసింది.