వల్లభనేని వంశీ కనిపించడం లేదు. కానీ ఆయనపై ఒక కేసు రెడీ అయిపోయింది. గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసును రీఓపెన్ చేశారు. అప్పట్లో వల్లభనేని వంశీ దగ్గరుండి ప్లాన్ చేసి మరీ దాడి చేయించారు. ఆ కేసులో అప్పటి పోలీసులు అరెస్ట్ చేసింది టీడీపీ వారిని. పట్టభిరాంను అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు.
ఇప్పుడు కాలం మారింది. పోలీసులు మారారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు కేసులో దూకుడు కూడా మారింది. కొత్త డీఎస్పీ సీసీ టీవీ ఫుటేజీ , మీడియా వీడియోలు చూసి పదిహేను మందిని అరెస్టు చేశారు. ఇందులో వంశీ డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ దాడిని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడమే కాదు.. ఆ సమయంలో టీడీపీ ఆఫీసు దగ్గరే ఉన్నట్లుగా మీడియాలో ఆధారాలు కూడా వచ్చాయి. టీవీ9తో మాట్లాడుతూ… తామే దాడి చేశామని చెప్పుకున్నారు కూడా.
వంశీ అడ్డంగా దొరికే కేసుల్లో ఇదొకటి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. గన్నవరం ఆఫీసుపై దాడికేసును డీఎస్పీ తీసుకున్నారు. ఇప్పుడు ఆ డీఎస్పీ తన పవర్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా వల్లభనేని వంశీ ఎక్కడున్నారో స్పష్టత లేదు. దేశంలో ఉన్నారా… రాష్ట్రంలో ఉన్నారా.. విజయవాడలో ఉన్నారా అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఏమీ మాట్లాడటం లేదు కూడా. ఒక వేళ ఆయన ధైర్యంగా విజయవాడలోనే ఉంటే… అసలు కథ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.