లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పోలీసులు టీడీపీ నేతలపై మాత్రమే కేసులు పెడుతున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘించి.. కరోనా వ్యాప్తికి కారణం అయ్యారంటూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇలా దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటేగౌడ, విడదల రజనీలకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
లాక్ డౌన్ సమయంలో.. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు చేసిన కార్యక్రమాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో బియ్యం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నగరి ఎమ్మెల్యే రోజా … ఓ బోరింగ్ పంప్‌ను ఓపెన్ చేసేందుకు వెళ్లి పూలు చల్లించుకున్న వీడియో వైరల్ అయింది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగేడ.. ఓ చిన్న కాలువపై బ్రడ్జి ప్రారంభోత్సవానికి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రశ్నించిన మీడియపై ఆయన బూతులు లంకించుకున్నారు. ఇక చిలుకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ.. వందల మందిని వెంటేసుకుని సాయం పేరుతో.. ఫోటో షూట్లు నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి.
వీరందరిపై లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.వీరే కాదు.. వైసీపీ నేతలందరూ అనేక కార్యక్రమాలు చేపట్టినా పోలీసులు పట్టించుకోలేదు. కానీ టీడీపీ నేతలు సాయం కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు పెట్టారు. చట్టం అందరికీ ఒక్కలాగే ఉండాలనే డిమాండ్లు వచ్చినా.. పోలీసులు పట్టించుకోలేదు. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో.. ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు వెళ్లాయి. వీడియో సాక్ష్యాలు ఉండటంతో వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడింది.