దగ్గుబాటి కుటుంబానికి షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లీజుకు ఇచ్చిన స్థలంలో హోటల్ ను కూల్చివేసినందుకు కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిల్మ్ నగర్లోని తమ స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తికి దగ్గుబాటి కుటుంబం లీజుకు ఇచ్చింది. ఈ నంద కుమార్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు. లీజుకు తీసుకున్న స్థలంలో దక్కన్ కిచెన్ అనే హోటల్ ను నడిపేవారు. అయితే లీజు విషయంలో దగ్గుబాటి కుటుంబంతో నందకుమార్ వివాదానికి దిగి కోర్టుకెళ్లాడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన తర్వాత 2022 నవంబరులో జిహెచ్ ఎంసీ సిబ్బంది హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు. తర్వాత యథాతథ స్థితి కొనసాగించాలని ..సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.
అయితే 2024 జనవరిలో హోటల్ ను పూర్తిగా కూల్చివేశారని నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు ..ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదుతో విచారణ చేపట్టారు.
నందకుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన లీజును ఉల్లంఘించి నిర్మాణాలు చేశారని.. తమ స్థలం విషయంలో దౌర్జన్యం చేశారని దుగ్గుబాటి ఫ్యామిలీ చెబుతున్నారు. అయితే కోర్టుల్లో పిటిషన్లు వేసి.. ఇతర రకాలుగా బెదిరించి దక్కన్ కిచెన్ హోటల్ ను..నిర్వహించేవారు. తమ స్థలం లీజుకు ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ తామే ఇబ్బందులు పడుతున్నారు.