వైఎస్ వివేకా హత్య కేసులో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు దేవి రెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవి రెడ్డి చైతన్య తో పాటు జమ్మలమడుగు మాజీ డిఎస్పి నాగరాజు ,ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాష్ పై కేసు నమోదు చేశారు.
తాను జైల్లో ఉన్నప్పుడు తనను ప్రలోభ పెట్టేందుకు బెదిరించేందుకు డాక్టర్ చైతన్యరెడ్డి లోపలికి వచ్చారని డబ్బులు కూడా తీసుకు వచ్చారని.. తనను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని దస్తగిరి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటన జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. కడప జైలు అధికారులు, పోలీసులు అంతా అవినాష్ రెడ్డి సిఫారసుతో నియమితలైన వారే ఉన్నారు. ఈ క్రమంలో కోర్టు ఈ అంశంపై దర్యాప్తు జరపాలని పోలీసుల్ని ఆదేశించింది. దర్యాప్తు జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు.
వివేకా కేసుతో సంబంధం లేదని ఓ కేసులో పోలీసులు దస్తగిరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైల్లో ఖైదీలకు హెల్త్ క్యాంప్ పేరుతో వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లోపలికి వెళ్లారు. అక్కడ సీబీఐ అధికారిపై ఆరోపణలు చేయాలని.. అప్రూవర్ గా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. బెదిరించడంతో పాటు డబ్బులు కూడా తీసుకొచ్చి చూపించారు. అయితే దస్తగిరి అంగీకరించలేదు. ఆ రోజున చైతన్యరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా లోపలికి వెళ్లింది నిజమేనని గుర్తించారు. ఆయన రెగ్యులర్ గా ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని తేలింది. అదే సమయంలో జైలు లో సీసీ ఫుటేజీని మాయం చేశారు. దస్తగిరి చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.