తెలంగాణ సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ అలియాస్ డీఎస్ తనయుడు సంజయ్ పై నిర్భయ కేసు నమోదైంది. మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు సాయంత్రం నిజామాబాద్ పోలీసులు ఇంటికి వెళ్లారు. కానీ సంజయ్ ఇంట్లో లేరు. సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు నిజామాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సంజయ్ కు చెందిన శాంకరీ కాలేజీలోని విద్యార్థినిలు కొంత మంది గురువారం… హైదరాబాద్ లో హోంతమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి తమపై సంజయ్ లైంకిగ వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. వెంటనే హోం మంత్రి డీజీపీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీజీపీ మమేందర్ రెడ్డి నిజామాబాద్ సీపీకి రిఫర్ చేశారు. ఈ ఉదయం ఆ విద్యార్థినులు అందరూ.. మరోసారి నిజామాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. సంజయ్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.
అంతకు ముందు సంజయ్ తనపై వచ్చిన ఆరోపణలపై ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. శాంకరీ కాలేజీకి తనకు సంబంధం లేదన్నారు.కొన్నేళ్ల క్రితమే.. తాను కాలేజీని వేరేవారి లీజుకిచ్చానని చెప్పారు. రాజకీయ కారణాలతోనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని ప్రకటించారు. విద్యార్థినుల్లో ఒకరు.. తనతో సంజయ్ తనతో సహజీవనం చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపైనా సంజయ్ స్పందించారు. తనకు భార్యాపిల్లలున్నారన్నారు. తాను ఎవరితోనూ సహజీవనం చేయలేదన్నారు.
డీఎస్ టీఆర్ఎస్ కు దూరమైన సమయంలోనే… ఆయన కుమారుడు సంజయ్ పై.. ఆరోపణలు రావడం.. ఏకంగా నిర్భయ కేసు నమోదు చేయడంతో.. రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని డీఎస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కానీ డీఎస్ మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ స్పందించలేదు. ప్రస్తుతానికి డీఎస్.. సాంకేతికంగా టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్నా.. ఆయనను దూరం పెట్టారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఓ పార్టీలో చేరేందుకు డీఎస్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరగా సాగుతున్న సమయంలో ఆయన కుమారునిపై నిర్భయ కేసు నమోదు కలకలం రేపుతోంది.