కేసీఆర్ మనవడితో గడిపేందుకు రెండు నెలల పాటు అమెరికా టూర్ కు వెళ్లాలనుకుంటున్నారు కానీ ప్రభుత్వం అలా వెళ్లనిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పదేళ్ల పాలనలో చేసిన అవకతవకతలు, అవినీతిపై కేసులు పెట్టక తప్పదని సంకేతాలు పంపుతున్నారు. పదేళ్ల పాటు విద్యుత్ రంగంలో చేసిన అవకతవకలపై నియమించిన జస్టిస్ లోకూర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో విద్యుత్ కొనుగోళ్లు, కొత్త ప్రాజెక్టుల విషయంలో జరిగిన తప్పిదాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆ నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్పై కేసులు పెట్టేందుకు రంగం సిద్దమయింది.
గతంలో జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రభుత్వం ఈ విషయంలో నియమించగా ఆయన తీరుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆయనను తప్పింది జస్టిస్ మదన్ బి లోకూర్ కు నియమించింది. ఆయన విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించారు. అందులో అవకతవకలను బయట పెట్టడంతో కేసీఆర్ పైకేసులు నమోదు చేసి.. విచారణ చేయనున్నారు. ఈ కేసులు సీఐడీకి ఇస్తారా.. ఏసీబీకి ఇస్తారా అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు కాళేశ్వరం అంశంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇంకా నివేదికలు సమర్పించలేదు.
కరెంట్ కొనుగోళ్లు కన్నా.. కాళేశ్వరం అందమే చాలా తీవ్రమైనదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జస్టిస్ ఘోష్ విచారణలో అసలు ఈ ప్రాజెక్టు విషయంలో తాము నిమిత్తమాత్రులమని కేసీఆర్ ఏం చెబితే అది చేశామని అత్యధిక మంది అధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ విషయంలో జరిగిన ఇంజినీరింగ్ తప్పిదాలకు.. అవినీతికి మొత్తం కేసీఆరే కారణమని తమకేమీ సంబంధం లేదంటున్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక తర్వాత కేసీఆర్కు మరిన్ని కష్టాలు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డిని మొదటి సారి అరెస్టు చేసినప్పుడు ఆయన కుమార్తె పెళ్లికి హాజరు కాలేకపోయారు. పది గంటలు పర్మిషన్ తీసుకుని పెళ్లికి వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ తన మనవడితో గడిపేందుకు అమెరికా వెళ్లేందుకు వేసుకున్నప్లాన్ ను అలాగే భగ్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.