వైకాపా హయాంలో సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని రెచ్చిపోయిన వాళ్లంతా, ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో గజ గజ వణుకుతున్నారు. పాత పాపాలు వాళ్లని నీడలా వెంటాడుతున్నాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికే చేసిన తప్పుకి తగిన మూల్యం చెల్లించుకొన్నాడు. ఈ లిస్టులో ఇంకా చాలామంది పేర్లు బాకీ ఉన్నాయి. శ్రీరెడ్డి ‘సారీ’ చెప్పి చేసిన తప్పుల్ని కడిగేసుకొనే ప్రయత్నం చేసింది. పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లకూ తగిన శాస్తి జరగాలని అంతా భావిస్తున్నారు. వీళ్లపై కూడా చర్యలు తప్పేలా లేవు. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్జీవీ వేట మొదలైనట్టు అనిపిస్తోంది.
టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా,వైకాపాకు అనుకూలంగా ఆర్జీవీ తీసిన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపుగా ఆయన వైకాపాని మోయడంలో సిగ్గు లేకుండా కష్టపడ్డారన్నది వాస్తవం. కొన్ని అబద్ధాల్ని, అభూత కల్పనల్ని సైతం ఆయన నిజాలుగా మార్చడానికి శతవిధాలుగా ప్రయత్నించి విఫలం అయ్యారు. ట్విట్టర్ లో కూడా వందలసార్లు రెచ్చిపోయిన వైనాలు గుర్తుండే ఉంటాయి. చంద్రబాబు, లోకేష్ లపై దాదాపుగా పగపట్టేశాడు ఆర్జీవీ. ‘వ్యూహం’ సినిమా ప్రచారంలోనూ చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాల్ని కించపరిచేలా కొన్ని ప్రకటనలు చేశారు. ఇప్పుడు వాటిని బయటకు లాగారు టీడీపీ నేతలు.
ప్రకాశం జిల్లా మద్దిపాడులో రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదైంది. అక్కడి స్థానిక నేతలు వర్మపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ‘వ్యూహం’ సినిమాప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఇది వరకు కూడా వర్మపై కొన్ని ఫిర్యాదులు అందాయి. అవన్నీ ఇప్పుడు తిరగదోడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.