చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై టీడీపీ నేతలు వరుసగా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. అంత నేరుగా చంద్రబాబు ప్రాణానికి ముప్పు తలపెడతామని విజయసాయిరెడ్డి బెదిరిస్తే డీజీపీ ఏం చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రశ్నించారు. హోంమంత్రి అనిత కూడా విజయసాయిరెడ్డిని వదిలేది లేదని ప్రకటించారు. దాంతో ఆయనకు మ్యూజిక్ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ రెడీ అయిందన్న అభిప్రాయం వినిపించింది.
దానికి తగ్గట్లుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని, చంద్రబాబు ప్రాణానికి హానితలపెట్టే కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఆయన ఇలా మాట్లాడటం వెనుక వారి దురుద్దేశాలు ఉన్నాయని గట్టిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబును చంపేస్తామంటూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ నుంచి గోరంట్ల మాధవ్ వరకూ అందరూ హెచ్చరిస్తూ ఉండేవారు. వైసీపీ అధికారంలోకి మళ్లీ వచ్చి ఉంటే ఏం చేసేవారో కానీ.. ఓడిపోయిన తర్వాత కూడా అదే టోన్ ను వైసీపీ నేతలు కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం , పోలీసులు ఏమీ చేయరన్న నమ్మకంలో ఉన్నారేమో కానీ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు అయిదే మిగిలిన వారు కూడా చంద్రబాబు వెనుక ఎలాంటి ప్లాన్లు చేశారో బయటకు వచ్చే అవకాశం ఉంది.