ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలను నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేసేందుకే వారంతా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారిని మన్నించి ఉద్యోగాల్లోకి తీసుకున్నా వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రభుత్వ పెద్దలు భావించడం లేదు. అందుకే వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కాకపోతే , వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటే ఓ షరతు విధించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎవరి మాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేశారో వారిపై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని.. ఆ తర్వాత తనను కలువాలంటూ సూచించారు. ఇప్పటికే వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయామని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా…ఇప్పుడు అచ్చెన్నా సూచనతో వేలాది మంది వాలంటీర్లు అదే పని చేయనున్నారు.
ఎన్నికల వేళ తమకు అనుకూలంగా ప్రచారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు వాలంటీర్లపై ఒత్తిళ్ళు తెచ్చారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకుంటామని నమ్మబలికి వారితో రాజీనామా చేయించారు. కానీ, ఏపీలో వైసీపీ పరాజయంతో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టబడ్డారు.
ఉద్యోగాలు తిరిగి పొందాలంటే ఎవరైతే రాజీనామా చేయించారో వారిపై కంప్లైంట్ చేయాలని అచ్చెన్నా సూచనతో వైసీపీ అభ్యర్థులపై ఫిర్యాదు చేసేందుకు వాలంటీర్లు సిద్దం అవుతున్నారు. లక్షకు పైగా వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోవడంతో అందులో సగం మంది వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులు నిలబడుతాయా..? వీటి ఆధారంగా వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది.