వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రతరం చేస్తున్నారు. జగన్ పై ఉన్న కేసులను ప్రముఖంగా ప్రతీ సభలో ప్రస్తావిస్తున్నారు. పెందుర్తి ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… తీవ్రవాదులకు కూడా సెల్ ఫోన్లు సప్లై చేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి శిష్యులకు ఉందనీ, వారి జీవితాంతం కుట్రలు చేయడానికే సరిపోతోందని విమర్శించారు. గత ఎన్నికల్లో విజయలక్ష్మి పోటీకి దిగితే, పులివెందుల నుంచి అడ్డపంచెలు దిగాయనీ, విశాఖలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలున్నాయి, ఎంతెంత కబ్జా చెయ్యొచ్చు అని చూసుకుంటూ పోయారన్నారు. దాంతో ప్రజలు భయపడిపోయి, విశాఖను కాపాడుకున్నారన్నారు.
వైకాపా నాయకుడు ధర్మాన ప్రసాదరావు అప్పుడే హెచ్చరికలు ప్రారంభించారనీ, అధికారంలోకి వచ్చేస్తున్నామనీ, చంపేస్తామని అప్పుడే బెదిరింపులు మొదలుపెట్టేశారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగానే ఇలా వ్యవహరించే నాయకులున్న ఈ పార్టీ, రేప్పొద్దున్న అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. ఈరోజు జగన్ నామినేషన్ వేశారనీ, ఆయనపై 12 కేసులు ఉన్నాయనీ, అన్నింట్లోనూ ఆయన ఏ-1 ముద్దాయనీ, రేపు పేపర్లలో అవే వస్తాయన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై కూడా ఇన్ని కేసులు లేవన్నారు. ఆయనపై కేసులు పెట్టిన అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై కూడా దాడి చేశారన్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా ఇదే విశాఖ నుంచి రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నారనీ, జగన్ కేసుల గురించి ఆయన మాట్లాడాల్సి ఉందని మరోసారి చంద్రబాబు అన్నారు. తనపై ఉన్న కేసులన్నింటినీ మరిపించడం కోసం జగన్ పాదయాత్ర చేశారన్నారు. చిన్నాన్న చనిపోతే ఎవరైనా రెండ్రోజులు ఇంట్లోంచి బయటకి రారనీ, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పరుగెత్తారనీ, తాము ఆ హత్య చేయలేదని చెప్పుకోవడానికి వెళ్లారన్నారు.
ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ జగన్ పై ఉన్న కేసులను ప్రముఖంగా చంద్రబాబు నాయుడు ప్రస్థావిస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై వైకాపా నుంచి సరైన కౌంటర్ ఇంకా రావడం లేదు. ఆ ప్రస్థావన తెచ్చే ప్రయత్నం కూడా తన సభల్లో జగన్ చేయడం లేదు. అది చాలదన్నట్టుగా… మూడ్రోజుల్లో రాష్ట్రంలో ఏదో ఘోరం జరుగుతుందన్నట్టుగా తాజాగా వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రచారం మరింత ఊపు అందుకోవాలంటే… ఈ కేసుల విషయమై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై జగన్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదో కోణం నుంచి కౌంటర్ ఇవ్వాలి.