అమెరికాలో ఉంటూ ఏపీ, తెలంగాణలోని రాజకీయ నేతలపై బూతులతో విరుచుకుపడే వైసీపీ కార్యకర్త పంచ్ ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచ్ ప్రభాకర్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై కూడా అనుచితంగా దూషించిన కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఆయన దాదాపుగా ప్రతీ రోజూ యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ప్రతీ వీడియోలోనూ ఆయన వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారో వారిని బండ బూతులు తిడుతూ ఉంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజులను కూడా ఆయన వదల్లేదు. ఈ అంశంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. తనకు తాను పంచ్ ప్రభాకర్‌గా చెప్పుకునే వ్యక్తి అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. అమెరికాలో వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తూంటారు. తాను వైసీపీ ఎన్నారై సభ్యుడినని చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన అందరిపై బూతులతో విరుచుకుపడుతూంటారు. నరకుతా.. చంపుతానని కూడా వ్యాఖ్యలు చేస్తూంటారు.
న్యాయమూర్తులపై దూషణల కేసుల్లోనూ ఆయన పేరు కీలకంగా ఉండటం.. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ వంటి వారినీ చంపుతానన్నట్లుగా మాట్లాడి ఉండటంతో ఆయనను ఇండియాకు పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు కోర్టు అనుమతి తీసుకునే కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.