విశాఖలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వారిపై రెండు రోజుల తరవాత పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖ సీపీ, డీజీపీని ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని… హైకోర్టు ఆదేశించడంతో.. పోలీసులు దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా కనిపిస్తోంది. పోలీస్ వ్యాన్ ఎక్కి మరీ.. ఆత్మహత్య చేసుకుంటానని .. బాటిల్లో కూల్డ్రింక్ పోసుకుని వచ్చి.. హంగామా చేసిన పాత నేరస్తుడు.. జేటీ రామారాను నిన్నటి వరకూ గౌరవంగా చూసుకున్న పోలీసులు ఈ రోజు.. కేసు నమోదు చేశారు. అలాగే.. చంద్రబాబు రోడ్డుపైకి వస్తే.. తాను చీర విప్పుతానంటూ.. ఆందోళనకు దిగిన మరో మహిళ కృపాజ్యోతి పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు.
అయితే.. వైసీపీ నేతలు మాత్రమే కాదు.. అక్కడ ఉన్న టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేశారు. వాటర్ ప్యాకెట్లు, రాళ్లు , చెప్పులు, గుడ్లు విసిరింది.. వైసీపీ కార్యకర్తలే అయినా.. బ్యాలెన్స్ చేయడానికన్నట్లుగా … టీడీపీ నేతలపైనా కేసులు పెట్టారు. తాము ఎలాంటి ఆందోళనలు చేయకుండా తమపై కేసు పెట్టడం ఏమిటని.. టీడీపీ నేతలు వాపోతున్నారు. ఘటన జరిగినప్పుడు వైసీపీ నేతల్ని అడ్డుకోని పోలీసులు.. ఆ తర్వాత కేసులు కూడా నమోదు చేయలేదు. అదే అమరావతి ఉద్యమంలో అయితే.. అధికార పార్టీకి చెందిన ఎవర్ని అడ్డుకున్నా.. వందల కేసులు నమోదు చేశారు. విశాఖలో మాత్రం.. వైసీపీ నేతల జోలికెళ్లలేదు. అయితే.. హైకోర్టు.. ఈ అంశంపై సీరియస్ అవడంతో.. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో.. వెంటనే… పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. కోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి మాత్రమే ఈ కేసుల ప్రహసనం అని.. అసలు వైసీపీ నేతల్ని ఆందోళనలకు ప్రోత్సహించింది పోలీసులేనని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు.. ఆదేశాలిచ్చి ఎప్పటికప్పుడు గైడ్ చేసిన.. వైసీపీ నేతలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.