ఓదార్పు యాత్రలో భాగంగా పదేళ్ల కిందట జగన్ వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే అది తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయం. జగన్ రాకుండా.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. జగన్‌కు మద్దతుగా ఉన్న కొండా సురేఖ దంపతులు… ప్రస్తుతం ఎంపీగా ఉన్న మాలోతు కవిత లాంటి వాళ్లు… రైల్వే స్టేషన్ కేబిన్‌లో ఉన్నారు. బయట నుంచి ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూంటే.. కేబిన్‌లో నుంచి తుపాకీ బుల్లెట్లు దూసుకొచ్చారు. అప్పుడు కొంత మంది వ్యక్తుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణ ఇప్పటికీ సాగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసుల్ని ఎత్తివేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారంటూ.. ఓ వ్యక్తి అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. దీనిపై కొండా దంపతులతో పాటు పలువుర్ని నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. జగన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినా… అక్కడ పరిస్థితులు అదుపు తప్పడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఆ ఘటన తెలంగాణ ఉద్యమం మరింత ఎగిసిపడటానికి కారణం అయింది. అప్పుడు టీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న జగన్ కు ప్రస్తుతం.. వారితోనే సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ అధినేతతో పాటు .. ఆ పార్టీ క్యాడర్ కూడా ఏపీలో జగన్ గెలవాలని కోరుకున్నారు. ఇప్పుడు.. వైసీపీకి మద్దతుగా ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు.
కేసీఆర్ – జగన్ మధ్య సైతం సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇప్పుడీ కేసు ముగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సీబీసీఐడీ వద్ద ఉంది. గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తికి… కేసును మూసివేస్తున్నామని అభ్యంతరాలుంటే చెప్పాలని.. నోటీసు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫిర్యాదు చేసిన వ్యక్తి సహజంగా మారిన పరిస్థితులతో అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి లేదు కాబట్టి… కేసును మూసేవేయడానికే ఎక్కువ అవకాశం ఉంది.