తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసిపి ఎదురుదాడి బాగానే సక్సెస్ అయింది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజం కూడా వైకాపాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇక దివాకర్స్ ట్రావెల్స్ ప్రమాదం, కేశినేని నాని గొడవ, పేపర్ లీక్ వ్యవహారంలాంటి వన్నీ కూడా వైకాపా జనాలకు ఉత్సాహాన్ని ఇచ్చినవే. అన్నింటికీ మించి ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం కూడా వైకాపాలో ఉత్సాహాన్ని పెంచింది. కానీ వైకాపా ఉత్సాహం అంతా కూడా పాలపొంగే అని తెలియడానికి మాత్రం అట్టే టైం పట్టలేదు.
జగన్ అవినీతిపరుడు కాదు…ఆణిముత్యం అని నిరూపించాలన్న అత్యుత్సాహంలో సాక్షి చేసిన తప్పు జగన్ మెడకు చుట్టుకుంది. టిడిపికి, టిడిపి మీడియాకు ఆయుధాలనిచ్చింది. జగన్‌పైన కేసులు నిలబడవు అని చెప్పి సాక్షి మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్యూ అయితే సిబిఐ వాదనకు బలం చేకూర్చేలానే ఉంది. ఇక 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ కూడా కనీసం నత్త నడకన కూడా నడవని జగన్ కేసుల వ్యవహారంలో ఇప్పుడు కదలిక కనిపిస్తోంది. జగన్ సూట్ కేసు కంపెనీల గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి బలమైన ఆధారాలే దొరకినట్టుగా ఉన్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ వైకాపా ఉత్సాహంపైన నీళ్ళు చల్లాయి. జగన్ మరోసారి జైలకు వెళ్తాడా అన్న అనుమానాలు క్రియేట్ అయిన పరిస్థితి. తనపైన ఉన్న కేసుల గురించి ఇప్పటి వరకూ జగన్ స్పందించింది లేదు. ఇప్పుడు కూడా బెయిల్ రద్దు పిటిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైండ్ అవుట్ చేసిన సూటు కేసు కంపెనీ వ్యవహారం గురించి జగన్ స్పందించే అవకాశం లేదు. అయితే వైకాపా శ్రేణుల్లో మాత్రం టెన్షన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు పాలనపై వస్తున్న వ్యతిరేకత వైకాపాలో ఉత్సాహం పెంచుతున్నప్పటికీ జగన్‌పై ఉన్న కేసుల వ్యవహారం కాస్తా 2019 ఎన్నికల నాటికి ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అన్న భయం మాత్రం కనిపిస్తోంది. ఈ విషయంలో ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.