అమరావతి రైతులు కాలు కదిపితే కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం.. కొంత మంది దళిత రైతులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా.. ఫిర్యాదు ఉపసంహరించుకున్నట్లుగా లేఖ ఇచ్చారు. అయినప్పటికీ.. పోలీసులు రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇప్పుడీ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. భూములిచ్చి రోడ్డున పడి వారు చేసుకుంటున్న ఉద్యమానికి పెయిడ్ ఉద్యమం అని ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేస్తున్నా… సహిస్తూ… వారి ఉద్యమం వారు చేసుకుంటున్నారు. అయితే వారికి పోటీగా… స్పాన్సర్డ్ మూడు రాజధానుల ఉద్యమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి రాజధాని గ్రామాల్లోకి మనుషుల్ని తీసుకు వచ్చి.. పోటీ ధర్నాలు చేయిస్తున్నారు.
ఇలా రైతుల్ని తీసుకు వస్తున్న ఆటోలను కొంత మంది దళిత రైతులు రాజధాని గ్రామాల్లో అడ్డుకున్నారు. ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడమే నేరం అయినట్లుగా.. రైతులపై ఓ వ్యక్తితో ఫిర్యాదు చేయించారు. తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి ఉపసంహరించుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఫిర్యాదును మాత్రమే తీసుకున్నారు. ఉపసంహరణను పట్టించుకోలేదు. దళిత రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
అయితే పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆ రైతుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి రాజధానిలో పెయిడ్ ఉద్యమం రోజువారీ పద్దతిలో సాగుతోంది. అసలైన రైతుల ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు వైసీపీ నేతలు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి కూడా వెనుకాడటం లేదు . భూములిచ్చిన రైతులు.. ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలో.. అన్ని విధాలుగా కష్టాలు పడుతున్నారు. అన్నింటికీ కారణం ప్రభుత్వమే. రాష్ట్ర రాజధానికి భూములివ్వడమే వారు చేసిన పాపం.