వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్ని తప్పించడం కోసం, దర్యాప్తు చేస్తున్న సీబీఐని బెదిరించడం కోసం తప్పుడు కేసులు పెట్టేశారు. ఇప్పుడు ఆ కేసు కొంత మంది మెడకు చుట్టుకుంటోంది. కోర్టు మళ్లీ సమగ్ర విచారణ చేయాలని పోలీసుల్ని ఆదేశించడంతో ఇప్పుడు లోతుల నుంచి పోలీసులు వివరాలు బయటకు లాగుతున్నారు. దీంతో భయపడి వైఎస్ జగన్ బంధువు కొంత మంది విచారణకు డుమ్మా కొడుతున్నారు.
వివేకా పీఏ గా పని చేసిన కృష్ణారెడ్డితో వాంగ్మూలం ఇప్పించి కేసు పెట్టించింది. ఇప్పుడు ఆ పీఏ కృష్ణారెడ్డి తాను ఏ పరిస్థితుల్లో సీబీఐ అధికారిపై తప్పుడు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందో వివరించినట్లుగా తెలుస్తోంది. జగన్ బంధువులు అయిన కొంత మంది తనను బెదిరించారని, ప్రలోభపెట్టారని తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు తనకు చేసిన ప్రయోజనాల గురించి కూడా కృష్ణారెడ్డి వివరించినట్లుగా తెలుస్తోంది. అప్పటి సీబీఐ అధికారి రామ్ సింగ్ అసలు తనను బెదిరించలేదని… విచారణ జరిపిన ప్రతీ సారి వీడియో రికార్డింగ్ చేశారని చెప్పినట్లుగా తెలుస్తోంది.
వివేకా కేసులో సీబీఐపైనే ఎదురు కేసులు పెట్టి ఎల్ల కాలం తప్పించుకుందామని అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉన్నంత వరకే ఇలా వ్యవస్థల్ని ఉపయోగించుకుని బెదిరించి పనులు పూర్తి చేసుకుంటారేమో కానీ అధికారం పోయిన తర్వాత అన్నీ బయటపడతాయి. ఇప్పుడు అదే పరిస్తితి. సీబీఐ అధికారిపై దొంగ కేసు వ్యవహారాన్ని ఎలా ముగించాలని అనుకుంటున్నారంటే.. మరో సారి దేశంలో ఎవరూ అలాంటి సాహసం చేయకూడదన్నట్లుగా ముగించాలనుకుంటున్నారు. అందుకే సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.