అక్రమాస్తుల కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ జగన్ తో పాటు ఆయన సహ నిందితులపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం..అక్కడ కొట్టివేస్తే హైకోర్టుకు రావడం వంటివి జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని కేసుల విచారణ కూడా ఆగిపోయింది.ఇప్పుడు హైకోర్టులో ఉన్న ఇలాంటి విచారణకు ఆటంకం కలిగించే పిటిషన్లన్నింటినీ రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగామ హైకోర్టు నిర్ణయించింది. అనేక రకాల పిటిషన్లు ఉండటంతో వాటిపై విచారణ ప్రారంభించి నిర్ణయం ప్రకటించనున్నారు.
దిగువ కోర్టులో విచారణలో ఉన్న 12 చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న పలు సంస్థలు, వ్యక్తులు తమపై నమోదైన కేసులను కొట్టేయాలని, స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపైనా ధర్మానసం విచారణ చేపట్టనుంది. బుధవారంతో కొన్ని కేసుల్లో స్టే ఉత్తర్వులు ముగియనున్నాయి. వాటిని పొడిగించేందుకూ హైకోర్టు నిరాకరిచింది. అరబిందో, హెటెరోలు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగనుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణకు రావడం లేదు. అదే సమయంలో జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని.. జగన్ , సహ నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులోనూ ఓ పిటిషన్ ఫైల్ చేశారు. ఇది కూడా విచారణకు రావాల్సి ఉంది. ఈ సమయంలో హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లు.. స్టేల పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించడం ఆసక్తి కలిగిస్తోంది.