చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్పై ఆరోపణలు చేశారు. ఆ వార్తలు పత్రికల్లో వచ్చాయి. టీవీ చానళ్లలో వచ్చాయి. అయితే.. చంద్రబాబు అలా ఆరోపించడంపైనా.. ఆ వార్తలను ప్రసారం చేసిన టీవీ చానళ్లు, పత్రికలపైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం క్షమాపణ చెప్పకపోతే.. కేసులు పెడతామని హెచ్చరిస్తూ.. నోటీసులు పంపింది. … “ఏమిటి.. అవాక్కయ్యారా..” అనిపించేలా ఉన్న ఈ వ్యవహారం నిజమే. శనివారం రెండు విషయాల్లో ఇలా.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సూర్య పత్రికలకు లీగల్ నోటీసులు పంపించిట్లుగా.. ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ సెంటర్లో శనివారం హఠాత్తుగా గోపాలకృష్ణ ద్వివేదీ మీడియా సమావేశం పెట్టారు. సాధారణ ఎన్నికల సమయంలో.. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆయన… ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన ఎన్ని శాఖలకు బాధ్యుడిగా ఉన్నారో.. చాలా మంది విలేకరులకు కూడా తెలియదు. హఠాత్తుగా ఆయన మీడియా ముందుకు వచ్చి గనుల శాఖ గురించి మాట్లాడటం ప్రారంభించారు. దాంతో గనుల శాఖ కూడా ఆయన దగ్గరే ఉందనుకుని క్లారిటీకి వచ్చారు మీడియా ప్రతినిధులు. అయితే.. ఆయన మీడియా ముందుకు వచ్చింది… మీడియాపై కేసులు పెడుతున్నామని చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి సంస్థకు.. గనుల కేటాయింపుపై చంద్రబాబు ఆరోపణలు చేశారని.. వాటిని మీడియా ప్రచురించిందని.. తాము చెప్పిన అంశాలను మాత్రం ప్రచురించలేదని.. అందుకే తమ పరువు పోయినట్లుగా భావించి.. నోటీసులు ఇస్తున్నామని చెప్పేశారు.
ఇలా రాజకీయ నేతలు చేసిన ప్రకటనలను ప్రచురించిన వారిపై కేసులు పెట్టడం.. చరిత్రలో ఎప్పుడూ లేదని.. జర్నలిస్టులు ద్వివేదీతోనే ఆశ్చర్యం ప్రకటించగా.. అలాంటివి ఉన్నాయని.. న్యాయ సలహా తీసుకునే.. నోటీసులు ఇస్తున్నామని ప్రకటించారు. అంతకు ముందు… రేషన్ బియ్యం.. సంచుల్లో ముఖ్యమంత్రి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ.. చేసిన ఆరోపణల విషయంలోనూ… చంద్రబాబుకు.. ఆంధ్రజ్యోతికి.. సూర్యకు నోటీసులు ఇచ్చినట్లుగా చెప్పారు. అయితే.. ప్రభుత్వ వాదన ప్రకారం.. తాము పంపిన రిజాయిండర్లు ప్రచురించలేంటున్నారు. కానీ ఆ పత్రికలు.. ప్రభుత్వ రిజాయిండర్లు.. మంత్రులు మాట్లాడిన మాటల్ని కూడా ప్రచురించామని చెబుతున్నాయి. ఎంతైనా ఏపీలో ఇప్పుడు కేసుల విప్లవం నడుస్తోంది. అందులో ఇదీ భాగమే..!