రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యేలతో బేరసారాలు నిర్వహించారు అని.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై.. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు కేసు నమోదు చేశారు. సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో.. షెకావత్ బేరసారాలు ఆడినట్లుగా ఉన్న మూడు ఆడియో టేపులు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆ మూడింటిని..మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత ఎస్‌వోజీ పోలీసులు… ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారంటూ.. కేసు నమోదు చేశారు. ఆయనతో మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ జైన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేరసారాల ఆడియో టేపులు వెలుగులోకి రావడం… రాజస్థాన్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
సచిన్ పైలట్.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో చర్చలు జరుపుతున్న విషయంపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందిందని… అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఆయన బీజేపీలో చేరాలనుకున్నారని స్పష్టం చేశారు. అసలు వివాదం కూడా.. ఆడియో టేపుల వ్యవహారంతోనే ప్రారంభమయింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కొన్నాళ్లుగా.. పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన బేరసారాల విషయం రికార్డులతో సహా దొరకగానే.. సచిన్ పైలట్.. తిరుగుబాటు చేశారని అంటున్నారు. అయితే.. ఆయన వైపు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతోనే చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతానికి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే పైలట్ వర్గం వైపు ఉన్నారు.
ప్రస్తుతం సచిన్ పైలట్ సహా పద్దెనిమిది కాంగ్రెస్ ఎమ్మెల్యే… అనర్హతా ముప్పును ఎదుర్కొంటున్నారు. స్పీకర్ అనర్హతా వేటు వేయకుండా న్యాయపోరాటం ప్రారంభించారు. అయితే.. ఈ విషయంలో స్పీకర్‌కే సంపూర్ణ హక్కులు ఉంటాయి. స్పీకర్ రెండు రోజుల సమయం ఇచ్చారు. ఈ లోపు గెహ్లాట్ సర్కార్ దూకుడుగా వెళ్తోంది. ఎమ్మెల్యేలు వెనక్కి రాకపోతే.. అనర్హతా వేటు ఖాయమని.. సంకేతాలు పంపుతున్నారు. దాంతో కొంత మంది అయినా వెవక్కి వస్తారని అంచనా వేస్తున్నారు. మరో వైపు.. హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రసవత్తరంగా సాగుతోంది.