తెలంగాణలో బాణసంచా అమ్మితే కేసులు నమోదు చేయనున్నారు. బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యం దృష్ట్యా బాణసంచా అమ్మకాలను నిషేధించాలన్న పిల్‌పై.. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ మార్గదర్శకాలు పాటిస్తూ, అవసరమైన ఆంక్షలు విధిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అయితే అదే సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో కరోనా ఎక్కువగా ఉందని ప్రభుత్వమే చెబుతుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బాణసంచా కాల్చడం సరైంది కాదని కోర్టు తెలిపింది.
కొంత మంది వ్యాపారులు బాణసంచా విక్రయాలకు ఏర్పాట్లు చేసుకన్నారని న్యాయవాది కోర్టు దృష్టి తీసుకెళ్లారు. అమ్మకాలు నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచాపై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందనే అంశాలు, కారణాలతో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఎలా అమలు చేశారో నివేదిక సమర్పించాలని ఆదేశఇంచాయి.
మరోవైపు ఇప్పటికే పలురాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. దిల్లీ సహా కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు నిషేధం విధిస్తూ ప్రకటన చేశాయి. హర్యానా సైతం పాక్షికంగా నిషేధం విధించింది. టపాసులు కాల్చేందుకు దూరంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలకు సూచించింది. ఏపీ సర్కార్ కూడా.. ఎన్జీటీ ఆదేశాలను పాటించాలని నిర్ణయించింది.