ఓటుకు నోటు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన కేసు! అయితే, ఆ కేసుపై సిగపట్ల వరకూ వెళ్లిన ఇద్దరు చంద్రులూ, ఒక దశ తరువాత దూకుడు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసుపై సోమవారం సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చనీయం అవుతోంది. తెలంగాణ డి.జి.పి., ఎ.సి.పి. డి.జి., రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి ఎ.కె.ఖాన్, కొంతమంది కీలక అధికారులు, న్యాయవాదులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. దీంతో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమైన కేసుపై ఇన్నాళ్ల తరువాత సమీక్ష ఎందుకు..? ఓపక్క విచారణ కూడా సాగుతోంది కదా, ప్రత్యేకంగా ఇప్పుడీ రివ్యూ ఎందుకు..? ఈ సమీక్ష ద్వారా ఏవైనా సంకేతాలు ఇవ్వాలన్నది కేసీఆర్ వ్యూహమా..? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. వీటికి సమాధానాలు వెతకాలంటే.. ఇద్దరి చంద్రుల ప్రస్తుత రాజకీయ లక్ష్యాలను ఒక్కసారి తెరిచి చూడాలి.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ముందున్న లక్ష్యం.. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు! తద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది ఆయన ఆలోచన. కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి ఏర్పాటు అంటూ మమతా బెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ వంటి నేతల్ని కలిసొచ్చారు. అంతేకాదు, నిన్ననే.. గవర్నర్ నరసింహన్ ని కలిసి ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాట్లను వివరించారు. అయితే, ఇవన్నీ కేసీఆర్ బహిరంగంగా చెప్పి చేస్తున్న పనులు. కానీ, ఇదే సమయంలో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆసక్తి లేదంటూనే భవిష్యత్తు జాతీయ రాజకీయాలకు అవసరమైన పునాదులకు ఒక్కో ఇటుకా నెమ్మదిగా పేర్చుకుంటున్నారు అనేది గమనించాల్సిన విషయం!
ఈ మధ్య, ఏపీ ప్రయోజనాల అంశమై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత… సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వివిధ పార్టీల నేతల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అదే సమయంలో, 11 పార్టీలతో చంద్రబాబు కూటమి కట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఈరోజు కూడా… అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధి విధానాలను మార్చాలంటూ త్వరలోనే అంతా కలిసి రాష్ట్రపతిని కలుద్దామన్నారు. అయితే, జాతీయ స్థాయిలో రాజకీయ కూటమి కట్టాలన్న లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నట్టు చంద్రబాబు ఎక్కడా చెప్పకపోయినా… భవిష్యత్తులో తాను పిలిస్తే ఢిల్లీ వేదికగా కలిసి పనిచేసేందుకు వచ్చేవారి సంఖ్యను నెమ్మదిగా పెంచుకుంటున్నట్టుగానే అర్థం చేసుకోవాలి.
ఓరకంగా.. సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం, కేసీఆర్ ఫెడరల్ కలలకు సమాంతరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ చెప్పి చేస్తున్నారు, చంద్రబాబు చెప్పకుండా చేస్తున్నారని అనిపిస్తుంది. బహుశా కేసీఆర్ కూడా అదే కనిపించీ, అనిపించీ ఉంటుందేమో! కాబట్టి, తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పెట్టాలన్నా, సీఎం చంద్రబాబును మరోసారి సందిగ్ధంలో పడేయాలన్నా, విమర్శలకు గురి చేయాలన్నా ఓటుకు నోటు కేసు అనేది ఉండనే ఉంది! సుప్తచేతనావస్థలో ఉన్న ఈ కేసుపై తాజా సమీక్ష పెట్టడం ద్వారా… తన ఫ్రెంట్ వ్యూహానికి సమాంతర ఆలోచనతో మొదలైన ప్రయత్నాలు ఏవైనా ఉంటే, వాటికి చెక్ పెట్టాలనే సంకేతాలు ఇవ్వడమే కేసీఆర్ తాజా ఎత్తుగడ అనే అభిప్రాయమూ ఈ సందర్భంగా వినిపిస్తోంది!