ఓటుకి నోటు కేసులో నిందితుడిగా పేర్కొనబడిన జేరుసలెం మత్తయ్య హైకోర్టుని ఆశ్రయించి ఆ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకొన్నప్పటికీ వేరే కేసులో నిన్న అరెస్ట్ అయ్యారు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్ధులకు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుండి బారీ మొత్తంలో డబ్బులు దండుకొని మోసం చేసినట్లు కొత్తపేటకి చెందిన కిరణ్ కుమార్ అనే విద్యార్ధి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మత్తయ్యని నిన్న అరెస్ట్ చేసి 11వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకి తరలించారు.
ఓటుకి నోటు కేసు కారణంగా తెదేపాకు తీరని అప్రదిష్ట, తీవ్ర నష్టం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక చీటింగ్ కేసులో మత్తయ్య అరెస్ట్ కావడం వలన తెదేపాకు ఇంకా అప్రదిష్ట కలుగుతుంది. వైకాపాని దొంగల ముఠాగా అభివర్ణిస్తున్న తెదేపాను ఇప్పుడు ఆ పార్టీ నిలదీయకుండా వదిలిపెట్టదు. అప్పుడు దాని విమర్శలకు జవాబు చెప్పుకోవడం చాలా కష్టమే అవుతుంది. మత్తయ్య కారణంగా వైకాపా ముందు తెదేపా తలదించుకోవలసి రావచ్చు.
ఓటుకి నోటు కేసులో తెదేపా ప్రభుత్వం మత్తయ్యని కాపాడి ఉండవచ్చు కానీ ఈ కేసులో అతనిని కాపాడే ప్రయత్నం చేస్తే విమర్శలకు గురికాక తప్పదు. అలాగని ప్రయత్నించకపోతే ఓటుకి నోటు కేసు గురించి మత్తయ్య నోరు విప్పితే ఇంకా ప్రమాదం. కనుక మత్తయ్య అరెస్ట్ వలన తెదేపాకు ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.