రాజ్యసభలో తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీ , సుప్రీంకోర్టు ప్రసిద్ధలాయర్ అభిషేక్ మను సింఘ్వి కుర్చీ దగ్గర రూ. 50వేలు దొరికాయని భద్రతా సిబ్బంది రాజ్యసభ చైర్మన్ కు ఇచ్చారు. ఆ యాభై వేలు రూ. 500 నోట్ల కట్ట. ఇదేమి పెద్ద మొత్తం కాదు. కానీ ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా ఇది మా డబ్బు అని ముందుకు రాలేదు. తాను స్వయంగా ఎలాంటి డబ్బు తీసుకు రాలేదని అది తనది కాదని అభిషేక్ సింఘ్వి కూడా ప్రకటించారు. అయితే ఎందుకు ఎంపీలు ఆ డబ్బు మాది కాదంటే మాది కాదంటున్నారు..?
పార్లమెంట్లోకి డబ్బులు తెచ్చుకోవడం నేరం కాదు. యాభై వేలు జేబులో ఉంచుకోడం నిషేధం కాదు. ఢిల్లీలో ఎంపీలకు ఉండే ఖర్చులతో పోలిస్తే అది ఒక్క రోజుకు సరిపోతుంది. ఇంట్లోకి సామాన్లు కొనుగోలు చేయాలన్నా సరిపోవు. మరి ఈ చిన్న మొత్తానికి ఎంపీలు ఎందుకు భయపడుతున్నారు?. అంటే ఈ డబ్బులో ఏదో లోగుట్టు ఉందని అనుకోవాలి. అభిషేక్ సింఘ్వి సీటు దగ్గరే ఆ డబ్బులు ఉన్నాయని ఆయనవి అని అనుకోవడానికి లేదని విచారణకు ఆదేశించారు.
అభిషేక్ సింఘ్వి సుప్రసిద్ధ లాయర్. ఆయన హైకోర్టులో వాదించాలంటే గంటల లెక్కల చార్జీలు వసూలు చేస్తారు. అది లక్షల్లోనే ఉంటుంది. అలాంటి వ్యక్తి దగ్గర యాభై వేలు నోట్ల రూపంలో ఉండటం పెద్ద విశేషం కాదు. ఆ డబ్బుల్ని ఎవరో ఎంపీలే తెచ్చి ఉంటారు ?. అయినా తమకు తెలియదని ఎందుకంటున్నారు ?