ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకూ ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులు ఇక నుంచినెలవారీగా బిల్లులు కట్టాలి. వారి వ్యవసాయ కనెక్షన్లకు ఇక నుంచి విద్యుత్ మీటర్లు చెల్లిస్తారు. అయితే.. రైతులు కట్టాల్సిన మొత్తాన్ని ముందుగానే రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం అని పేరు పెట్టారు. మార్గదర్శకాలు విడుదల చేశారు . దీని ప్రకారం.. నెలవారీ బిల్లు మొత్తాన్ని ముందుగానే రైతు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం నుంచి అందుకున్న మొత్తాన్ని రైతు తిరిగి విద్యుత్ కంపెనీకి చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టమవుతోందని… అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను డిమాండ్ చేసే హక్కు ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు.
ఉచిత విద్యుత్ పథకం.. ఏపీలో ఓ ట్రెండ్ సెట్టర్ లాంటిది. అయితే.. ప్రస్తుతం.. అప్పుల కోసం… ఏపీ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆత్మనిర్భర ప్యాకేజీ నిధులు.. ఎఫ్ఆర్బీఎం సవరణ చట్టానికి కేంద్రం ఆమోద పొందాలంటే.. ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు అమలు చేయాలి. దాని ప్రకారం… విద్యుత్ విషయంలో ఇస్తున్న అన్ని రకాల సబ్సిడీలు ఎత్తివేయాలి. దీనికి ఏపీ సర్కార్ అంగీకరించి.. ఉచిత విద్యుత్ పథకాన్ని తీసేసింది. అయితే.. రైతుల్లో తీవ్ర ఆగ్రహం వస్తుంది కాబట్టి… ఎంత బిల్లు అవుతుందో.. అంతే మొత్తం ముందుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెబుతోంది. కానీ ప్రభుత్వ చెల్లింపులు ఎలా ఉంటాయో ఇప్పటి వరకూ చూశారు కాబట్టి.. రైతులకు ఆందోళన ప్రారంభమయింది.
ఏపీ మొత్తం మీద వ్యవసాయ సంపుసెట్లకు ఇప్పటి వరకూ ఆరు గంటల వరకూ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. వీటికి పెద్దగా మీటర్లు కూడా ఉండవు. తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఇప్పుడు.. ఉచిత విద్యుత్ పథకాన్ని మార్చేసి.. నగదు బదిలీగా చేస్తున్నారు. విద్యుత్ సబ్సిడీలను పెద్ద ఎత్తున ఇస్తున్న ప్రభుత్వం.. వాటిని డిస్కంలకు తిరిగి చెల్లించడం లేదు. దాంతోనే సమస్య వచ్చింది. విద్యుత్ కంపెనీలకే కట్టని ప్రభుత్వాలు.. ఇక నేరుగా ఎలా రైతుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తాయన్నది ఊహించలేని విషయం. ప్రభుత్వం నగదు బదిలీ చేయకపోతే… రైతులే కట్టుకోవాల్సి ఉంటుంది.