తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగా మారిపోయారు! ఎంతలా అంటే… ప్రధానమంత్రి ఏం చెబితే అదే పాటించేంతలా! మరోలా చెప్పాలంటే… తెలుగు ప్రజల కష్టాలను పట్టించుకోనంతలా! తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నగదు కోసం కష్టాలుపడుతున్నారు. శని, ఆదివారాలు అనే తేడా లేకుండా డబ్బుల కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ కష్టాల గురించి ముఖ్యమంత్రులు మాట్లాడం మానేసి… ‘గో క్యాష్ లెస్’ అని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అలా ఎలా బతకడమో శిక్షణ ఇస్తున్నారు! ఇప్పటికిప్పుడే ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలు నేర్చేసుకుని.. ఎంచక్కా జేబులో పైసల్లేకుండా పైలాపచ్చీసుగా బతికేయమంటున్నారు! అలా ఎలా బతకడమో నేర్పేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకూ అవగమౌతాయన్నది పెద్ద క్వశ్చన్ మార్క్!
నగదు రహిత లావాదేవీలు ఎలా చేసుకోవాలో తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు అవగాహన శిబిరాన్ని తెరాస సర్కారు ఏర్పాటు చేసింది. దీనికి డిజిటల్ ఫైనాల్స్ లిటరసీ అనే పేరు పెట్టారు! అనుకున్నట్టుగా అవగాహన శిబిరాలు ముగిసిపోయాయి. అంటే, ఇకపై తెలంగాణ సచివాలయ ఉద్యోగులందరికీ ‘క్యాష్ లెస్’ అవగాహన వచ్చేసిందా అనుకుంటే… కరెక్ట్ చెప్పడం కష్టం. ఎందుకంటే, ఎంతోమంది ఉద్యోగులకు ఇంకా చాలా అనుమానాలు మిగిలిపోయాయట!
సో… ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఉద్యోగులు కాబట్టి, ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు పెట్టిమరీ ‘నగదు రహిత జ్ఞానాన్ని’ పెంపొందించారు. ఈ లెక్క నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి..? నిరుపేదలు, వృద్ధుల పరిస్థితి ఏంటీ..? వాళ్లకి ఎవరు శిక్షణ ఇస్తారు..? నగదు రహితంగా బతకడం ఎలాగో వారికి ఎలా నేర్పిస్తారు..? ఇలాంటి విషయాల గురించి తెలంగాణ సర్కారుగానీ, ఆంధ్రా సర్కారుగానీ ఆలోచించడం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులకూ కావాల్సిందల్లా ఒక్కటే… ప్రధాని మోడీ దృష్టిలో శబాష్ అనిపించుకోవడమే అనే విమర్శలు పెరుగుతున్నాయి.
అయినా, మన సామాజిక ఆర్థిక విద్యా వైజ్ఞానిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశానికి క్యాష్‌లెస్ కాన్సెప్ట్ ఇప్పట్లో సరిపోదని ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. పైగా, డెడ్లైన్లు పెట్టిమరీ ప్రజలకు క్యాష్ లెస్ లావాదేవీలు నేర్చుకోవాలని బలవంతంగా రుద్దేయడం కూడా సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా నగదును అందుబాటులోకి తేలేక… ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ‘గో క్యాష్ లెస్’ అనే నినాదాన్ని అందుకుందని చెప్పాలి. దానికి చంద్రబాబు, కేసీఆర్‌లు కూడా వంతపాడుతున్నట్టుగా ఉంది!