మీరు ఓసీలా.. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత…!
మీరు బీసీలా.. అయితే.. రెండేళ్ల తర్వాత..!
మీరు బీసీల్లో మరో కులమా… అయితే… ఏడాదిన్నర తర్వాత..!
మీరు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలా.. అయితే.. ఏడాది తర్వాత..!
మీరు స్కూలుకెళ్తున్న విద్యార్థులా.. అయితే.. రెండు, మూడు నెలలు..!
ఈ కులాల వారీ విభజనలు.. క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికో.. మరో ఫార్మాలిటీకో కాదు.. ప్రభుత్వ పథకం అందుకోవడానికి. గొప్పగా.. కంటి పరీక్షలు చేస్తామని ప్రకటించేసిన సర్కార్ .. దానికి ప్రకటించిన విధి విధానాల్లో.. కులమే ప్రధానాంశం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రజలందరికీ కంటి పరీక్షలు చేయాలనుకుంటోంది. అయితే.. ప్రాధాన్యాలు నిర్ణయించాలి కాబట్టి.. కులం చూస్తోంది. అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగును ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. 5 దశల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఒకటి, రెండు దశల్లో స్కూలు విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. 3, 4, 5 విడతల్లో కులాల వారీగా కంటి పరీక్షలు చేస్తారట.
అయితే.. అందరికీ ఒకే సారి చేయాలంటే.. తగినంత మంది మ్యాన్ పవర్ ఉండరు కాబట్టి.. మూడేళ్లలో ఐదు కోట్ల 70 లక్షల మందికి చేయాలనుకుంటోంది. రాష్ట్ర జనాభా అంత మంది లేరనే డౌట్ తెచ్చుకోవాల్సిన పని లేదు…. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే సమయానికి ఆ మాత్రం పెరుగుతుంది. ప్రభుత్వం ముందు చూపుతో ఉంది. ముందు విద్యార్థులకు పరీక్షలు చేసి.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కులాల వారీగా కళ్లను పరిశీలించి.. ఆపరేషన్లు అవసరం అయిన వారికి ఆపరేషన్లు… లేదంటే కళ్ల జోళ్లు అందిస్తారట. ప్రభుత్వం ఓ పథకానికి మూడేళ్ల టైమ్ లైన్ పెట్టుకోవడమే విచిత్రం అయితే.. అందులోనూ.. ఎన్నో పరిమితులు పెట్టుకోవడం… అయినప్పటికీ ఉన్న జనాభా కన్నా.. ఎక్కువగా పరీక్షలు చేస్తామని లక్ష్యంగా నిర్దేశించుకోవడం.. అందర్నీ విస్మయపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా.. కులాల కోణంలోనే.. అన్నీ చూస్తోంది. సంక్షే్మ పథకాలను.. కూడా కులాల ప్రకారం వర్గీకరిస్తోంది. ఇప్పటికే కౌలు రైతులకు.. కులం అంట గట్టేసి..ఓసీ అయితే.. ఎలాంటి రైతు భరోసా పథకాన్నీ అమలు చేయబోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు.. కంటి పరీక్షలకూ.. కులమే ఆధారంగా వర్గీకరిస్తోంది. పేదరికానికి కులం ఏముంటుందో ప్రభుత్వానికి తెలియడం లేదు. కంటి పరీక్షలు చేయించుకోలేని.. వారి కోసం ఏర్పాటు చేస్తున్న పథకం కాబట్టి.. కులం చూడాల్సిన అవసరం ఏముందనేది ప్రధానమైన సందేహం. ఈ ప్రభుత్వం కులం ప్రకారమే పాలన చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.