సింపుల్‌గా చేద్దామనుకుంటే చినికి చేటంతయి..చాపంతయిందని ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. రాహుల్ గాంధీ అభీష్టం అంటూ 2015లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక-ఆర్థిక మరియు విద్యా సర్వే పేరుతో కులగణన చేసింది. కానీ ఆ నివేదికను బయట పెట్టే ధైర్యం చేయలేకపోయారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ పని పూర్తి చేశారు. దాంతో కర్ణాటకలోనూ ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ ప్రారంభమయింది. తీరా నివేదికలోనూ అంశాలు చూసి.. దాదాపుగా అన్ని వర్గాలు రగిలిపోతున్నాయి. దీంతో కేబినెట్ లో కూడా కులగణన నివేదికను ఆమోదించకుండా.. పక్కన పెట్టేశారు. అయితే ఈ ఇష్యూ మాత్రం పక్కకు పోయే అవకాశాలు కనిపించడం లేదు.
లింగాయత్, వక్కలిగల ఆగ్రహం
కర్ణాటక రాజకీయాలను శాసించే వర్గాల్లో లింగాయత్, వక్కలిగలు అగ్రస్థానంలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి లింగాయత్‌ల సపోర్టు ఎక్కువగా ఉంటుంది. వక్కలిగల్లోనూ కొంత మద్దతు ఉంటుంది. ఈ రెండు వర్గాలు కులగణన నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు కులాలు ఈ నివేదికను అశాస్త్రీయంగా చెబుతున్నాయి. ఈ సర్వే అంతా బోగస్ అని దాన్ని రద్దు చేసి మళ్లీ కావాలంటే కొత్తగా చేయాలని అంటున్నాయి. తమ కులాల జనాభాను తక్కువగా చూపించి బలహీనుల్ని చేసే కుట్ర చేస్తున్నారని ఆయా కులాలు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కులాల వారీగా విడిపోయిన కాంగ్రెస్ నేతలు- అంతర్గత రచ్చ
మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కులాల వారీగా విడిపోయారు. లింగాయత్ , వొక్కలిగ వర్గాలకు చెందిన వారు కూడా సొంత పార్టీపై అసహనంతో ఉన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమ్యూనిటీ బాగా పెరిగిందని చూపించడం ఏమిటని వారంటున్నారు. ఈ నివేదిక విడుదలైతే రాజకీయంగా సున్నితమైన రిజర్వేషన్ విధానాలపై ప్రభావం చూపిస్తుందని వాదిస్తున్నారు. అందుకే కేబినెట్ లోనూ ఆమోదించేందుకు సిద్ధపడలేదు.
అన్ని కులాల్ని దూరం చేసుకున్నట్లే !
కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ కు ఇప్పుడు కర్ణాటకలో అందరూ దూరమయ్యే పరిస్థితి వచ్చింది. లింగాయత్‌లు, వొక్కలిగలు ఆగ్రహిస్తే పార్టీ మరోసారి గెలవడం అసాధ్యం. వారి అసంతృప్తి కాంగ్రెస్‌కు రాజకీయంగా భారీ నష్టం కలిగిస్తుంది. అనవసరమైన బండను నెత్తి మీదవేసుకున్న కాంగ్రెస్ పార్టీని భరితంగా ఇరుకున పెడుతున్నాయి బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీలు. కులగణనతో నెత్తి మీద చేయి పెట్టుకున్నట్లుగా ఉందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మథనపడుతున్నారు.