ఎన్నికల సమయంలో బహిరంగసభలు పెట్టి.. అన్ని పార్టీల్లోని తమ కులాల నేతలను పిలిపించి.. తమ కులానికి వేదికపై నుంచి హామీలు ఇప్పించడాన్ని కుల సంఘాలు చేస్తూంటాయి. ఇప్పుడు ఇవి కొత్త పాత్రలోకి వస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలను దత్త తీసుకుంటున్నాయి. వారి కోసం.. ఇతర కులాల నేతలపై… కొత్త తరహా విమర్శలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్‌పై.. రెడ్డి సంక్షేమ సంఘం.. తీవ్ర విమర్శలు చేయగా… పవన్ కు క్షమాపణ చెప్పాలని కాపు నాడు.. రెడ్డి సంక్షేమ సంఘాన్ని డిమాండ్ చేసింది. దీంతో.. కుల సంఘాల రాజకీయం.. బహిరంగమైపోయింది. ఇప్పటి వరకూ ఎవరి కులం సంక్షేమానికి వారు ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇప్పుడు.. ఎదుటి కుల నేతల్ని విమర్శించడం ప్రారంభమయింది.
రెండు రోజుల కిందట.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి హాని జరిగినా పవన్ తల తీసేందుకు వెనుకాడమని రెడ్డి సంక్షేమ సంఘం బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. రెడ్డి సంక్షేమ సంఘం రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ కాదు. కానీ.. రాజకీయ విమర్శల్లో తలదూర్చింది. రాజకీయంగా చాలా మంది చాలా విమర్శించుకుంటారు కానీ.. ఎక్కడా కుల సంఘాలు జోక్యం చేసుకోవు. తమ కులం సంక్షేమం కోసం ప్రయత్నిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం.. పవన్ కల్యాణ్‌ను.. హెచ్చరించి.. రాజకీయ రగడ సృష్టించడానికి రెడ్డి సంక్షేమ సంఘం తెరపైకి వచ్చినట్లుగా జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. రాప్తాడుకు చెందిన జనసేన నేత.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. దాన్ని పవన్ కు ముడిపెట్టారు.. రెడ్డి కుల సంఘ నేతలు.
రాజకీయ పరమైన విమర్శలకు రాజకీయంగా సమాధానం ఇవ్వకుండా.. వైసీపీ నేతలు రెడ్డి సంక్షేమ సంఘం పేరుతో.. కుల పరమైన విమర్శలకు .. తెర తీశారు. రాజకీయంగా చేసే విమర్శలకు.. వైసీపీ కులసంఘాలను రంగంలోకి దించడంతో పవన్ కు మద్దతుగా… కాపునాడు తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని.. డిమాండ్ చేసింది. ఒక్క రెడ్లు ఓట్లు వేస్తేనే జగన్ సీఎం కాలేదనే విషయాన్ని.. వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి కులాల రొచ్చులో కూరుకుపోతున్న ఏపీలో.. ఇప్పుడు కుల సంఘాలు కూడా.. తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధమయ్యాయి.