“రెడ్డి గారు వచ్చారు. అంత చేశారు. ఇంత చేశారు. చివరకు ముంచారు” ఇది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలోని ఉన్న అలనాటి జనపదం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీరుతో దశాబ్దాల నాటి ఈ జనపదం వాస్తవ రూపం తీసుకుంటోంది. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోని మీడియాలో ప్రస్ఫుటమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కుల ప్రాతిపదికన ప్రభుత్వ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, చివరకు కొందరు అధికారులు కూడా కుల ప్రాతిపదికన పని చేస్తున్నారు. తాజాగా ఈ కుల జాడ్యం ప్రజాస్వామ్యంలో నాలుగో స్థానం అయిన మీడియాను కూడా పట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని ఈ కుల పిచ్చి మీడియాలోని ప్రధాన స్రవంతిలో చాప కింద నీరులా ప్రవేశిస్తోంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గా విడిపోయి బురద చల్లుకునే స్థాయికి వెళ్లారు. ఈ సమయంలో ప్రాంతీయ ప్రేమలు, వ్యతిరేకతలు లేని ఫక్తు జర్నలిస్టులు మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మళ్లీ ఆరేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులచిచ్చుతో మీడియా రగిలిపోతోంది. అధికార పార్టీకి చెందిన మీడియాలో ఓ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు పని చేసే అవకాశం లేకుండా పోతోంది. వీరి అధికార ఛానల్ లో ప్రతిరోజు లైవ్ కార్యక్రమం నిర్వహించే ఓ సీనియర్ జర్నలిస్టు కూడా జగన్ వ్యతిరేక సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయనపై రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. మన సామాజిక వర్గాన్ని తిడుతున్న వారి దగ్గర ఎలా పని చేస్తారు అని ఒక సామాజిక వర్గం, మేం తప్ప మీకు దిక్కు లేదా అంటూ మరో సామాజిక వర్గం ఆ సీనియర్ జర్నలిస్టు పై వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సమాజాన్ని మారుస్తాం అంటూ చెబుతున్న మరో ఛానల్ లో కూడా ప్రతిరోజు రాత్రి ఓ కీలక చర్చాగోష్టి నిర్వహించే మరో సీనియర్ జర్నలిస్ట్ ది కూడా ఇదే పరిస్థితి అంటున్నారు. ఆ చానల్ యాజమాన్యం చర్చాగోష్టి నిర్వహిస్తున్న యాంకర్ ను “ వాళ్లపై గొంతు పెంచండి. వీళ్లను ఇరుకున పెట్టకండి” అంటూ హిత వచనాలు పలకడంతో పాటు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం. మీడియాలో డెస్క్ ల్లోనూ, రిపోర్టింగ్ లోనూ ఉన్న జర్నలిస్టులైతే ఏదో ఒక సామాజికవర్గం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఎక్కడకు ఏ జాడ్యం వెళ్ళకూడదో అక్కడికి అది వెళ్లిందని సీనియర్ జర్నలిస్టులు వాపోతున్నారు.