తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా తలపండిపోయిన వ్యక్తి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. ముందుగా.. ఆ నిర్ణయాన్ని ప్రజల్లోకి పంపి.. ప్రజాస్పందనను పరిశీలించి.. ఆనక నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు ఎన్నికల దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ కేసీఆర్ అదే ఫార్ములా పాటించారు. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గం విషయంలోనూ అదే ఫార్ములా పాటిస్తున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని… నలుగుర్ని తీసుకోబోతున్నారని.. నమస్తే తెలంగాణ కన్నా.. ఎక్కువగా.. టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్న సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. ఆ నలుగురు మంత్రులూ అగ్ర సామాజికవర్గాలకు చెందిన వారే. కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల, వెలమ సామాజికవర్గం నుంచి హరీష్, కేటీఆర్, రెడ్డి సామాజికవర్గం నుంచి.. సబితా ఇంద్రారెడ్డిని తీసుకోవాలనకుంటున్నట్లుగా సాక్షి జనంలోకి ఫీలర్ పంపింది. ఆ తర్వాత మరో రెండు బెర్తులు ఖాళీ అవుతాయని… వాటిని గతంలో మాటిచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డికి ఇస్తారని సాక్షి మీడియా చెబుతోంది.
నిజానికి కేబినెట్ విస్తరణపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. సామాజికవర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం ఆధారంగా కేసిఆర్ గత కేబినెట్ లో టీంను ఎంపిక చేసుకున్నారు. అయితే కొంత మంది విషయంలో ఆయన ఒకింత అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఇంఛార్జిలుగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రుల విషయంలో కొంత కోపంగా ఉన్నట్లు సమాచారం. పరిషత్ ఎన్నికల ఫలితాలు కేసిఆర్ కోపాన్ని కొంత తగ్గించినట్లైంది. హరీష్, కేటిఆర్ ను పక్కాగా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆయనకు తిరిగి పాత శాఖలనే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సభితా ఇంద్రారెడ్డి కి కెబినెట్ బెర్త్ ఖాయమైంది. ఆ హామీ మేరకే ఆమె కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ గుటికి చెరుకున్నారు.
అయితే సాక్షి చెప్పినట్లుగా.. వచ్చే ఆరు బెర్తుల్లో మూడు రెడ్లు, రెండు వెలమ, ఒకటి కమ్మలకు ఇస్తే.. సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయి. మాదిగ, మున్నూరు కాపు, ఎస్టీ సామాజిక వర్గాలనుండి ప్రాతినిధ్యం లేదు. సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొంది టిఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిన సండ్ర వెంకట వీరయ్య పేరు ప్రచారంలోకి వచ్చినా.. చివరికి… తుమ్మల పేరు ఫైనల్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి గత కేబినెట్ లో జోగు రామన్న మంత్రి గా ఉన్నారు. అయితే తొలి విడత కేబినెట్ లో కేసిఆర్ అవకాశం ఇవ్వలేక పోయారు. జోగు రామన్న, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, దాస్యం వినయ్ భాస్కర్ ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలుగా ఉన్నారు. కేబినెట్ బెర్తులపై సాక్షి ప్రచారానికి టీఆర్ఎస్ లో పెద్దగా అసంతృప్తి కనబడకపోతే.. వారినే కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.